Page Loader
Panama Canal: పనామా కాలువపై అమెరికా కన్ను.. చైనా ప్రభావం తుడిచివేయాలని హెగ్సెత్ ప్రకటన
పనామా కాలువపై అమెరికా కన్ను.. చైనా ప్రభావం తుడిచివేయాలని హెగ్సెత్ ప్రకటన

Panama Canal: పనామా కాలువపై అమెరికా కన్ను.. చైనా ప్రభావం తుడిచివేయాలని హెగ్సెత్ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 09, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

పనామా కాలువను చైనా ప్రభావం నుంచి బయటపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక ప్రకటన చేశారు. మధ్య అమెరికా పర్యటనలో భాగంగా పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో రహస్యంగా సమావేశమైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. 'పనామా కాలువను చైనా నిర్మించలేదు, ఆపరేట్ చేయడం లేదు. ఇది పనామా దేశ అధీనంలో ఉండాలి. అమెరికా సహకారంతో చైనా ప్రభావం లేకుండా కాలువను రక్షించేందుకు చర్యలు తీసుకుంటాం. కాలువను అన్ని దేశాలకు అందుబాటులో ఉంచేందుకు పని చేస్తామని హెగ్సెత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా మిలిటరీ పనామా భద్రతా బలగాలకు సహకారాన్ని పెంచుతోందని తెలిపారు. చైనా నుంచి తలెత్తే ముప్పును అర్థం చేసుకున్నామని కూడా చెప్పారు.

Details

ఓడరేవులపై ప్రభావం చూపే అవకాశం

కాలువ భద్రతపై పనామా తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రశంసించారు. ఇక ఇటీవల అమెరికా, హాంగ్‌కాంగ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీలో అమెరికా భాగస్వామిగా మారడంతో, కాలువకు ఇరువైపులా ఉన్న ఓడరేవులపై ప్రభావం చూపే అవకాశాన్ని అమెరికా సాధించింది. అయితే ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. పనామా కాలువను అమెరికా 1914లో నిర్మించింది. అయితే 1999 డిసెంబరులో అమెరికా-పనామా ఒప్పందం ప్రకారం దీనిని పూర్తిగా పనామాకు అప్పగించింది.

Details

కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటాం : ట్రంప్ హెచ్చరిక

ప్రస్తుతం ఆ కాలువ ద్వారా అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకల రాకపోకలపై భారీ ఫీజులు వసూలు చేస్తున్న పనామా చర్యలపై అప్పటి అధ్యక్షుడు ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'ఈ ఫీజులను తగ్గించకపోతే, కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అప్పట్లో ప్రమాణ స్వీకార వేడుకలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ములినో పనామా కాలువను ఎవరు బహుమతిగా ఇవ్వలేదు. అది మాది, మాకు మాత్రమే సొంతమని స్పష్టం చేశారు.