Russia-Ukraine War: అమెరికా కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇచ్చే ప్రసక్తే లేదు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించమని అమెరికా స్పష్టం చేసింది. వైట్‌హౌస్ తన తాజా ప్రకటనతో ఉక్రెయిన్ రక్షణకోసమే తాము సాయం చేస్తాము గానీ, అణ్వాయుధాలను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ త్యాగం చేసిన అణ్వాయుధాలను తిరిగి ఇవ్వాలంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఈ వివరణ వెలువడింది. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఉక్రెయిన్ వద్ద సుమారు 5,000 అణ్వాయుధాలున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద అణు సామర్థ్యం కలిగిన దేశాల్లో ఉక్రెయిన్ మూడో స్థానంలో ఉంది.
ఉక్రెయిన్ కు మద్దతును మాత్రమే ఇస్తాం
అయితే 1994లో బ్రిటన్, అమెరికా, రష్యాలతో జరిగిన 'బుడాపెస్ట్ ఒప్పందం' ప్రకారం, ఈ అణ్వాయుధాలను నాశనం చేయడానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్ సార్వభౌమత్వం, సరిహద్దులను గౌరవించాలనే హామీతోపాటు, ఎలాంటి సైనిక చర్యలు చేయమని అమెరికా, రష్యా, బ్రిటన్ ప్రకటించాయి. 1996 నాటికి ఉక్రెయిన్ తన చిట్టచివరి అణ్వాయుధాన్ని రష్యాకు అప్పగించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే డిమాండ్లు రష్యా ఉగ్రరూపం దాల్చడానికి కారణమయ్యాయి. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక దాడులు ప్రారంభించడంతో, యుద్ధం కొనసాగుతూనే ఉంది. పశ్చిమ దేశాల నుంచి ఆర్థిక, సైనిక సాయం పొందుతూ ఉక్రెయిన్ తన రక్షణను కట్టుదిట్టం చేస్తోంది.
అమెరికా ప్రకటనలో కీలక అంశాలు
1.ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు తిరిగి ఇవ్వడం అనేక రాజకీయ, భద్రతా సమస్యలకు దారితీయొచ్చు. 2. రష్యాపై ఉక్రెయిన్ తనకు అందించిన సాంప్రదాయ ఆయుధాలతోనే పోరాడుతోంది. 3. నాటోలో చేరడానికి ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా, ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యర్థనపై పశ్చిమ దేశాల నిర్ణయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రష్యాతో శాంతి చర్చలు జరపడానికి ముందు, తమకు భద్రతా హామీలు ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. నాటోలో చేరడం, భారీ స్థాయిలో ఆయుధాల మద్దతు అందించడం తమకు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.