LOADING...
Jake Sullivan: అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది.. భారత్‌ సుంకాలపై మాజీ అమెరికా భద్రతా సలహాదారు
భారత్‌ సుంకాలపై మాజీ అమెరికా భద్రతా సలహాదారు

Jake Sullivan: అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉంది.. భారత్‌ సుంకాలపై మాజీ అమెరికా భద్రతా సలహాదారు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న సుంకాల నిర్ణయంపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ కూడా భారత్‌ పై విధించిన టారిఫ్‌లను తప్పుబట్టారు. ఈ చర్యల ఫలితంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్‌లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సుల్లివన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా మిత్ర దేశాలు సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాతో భాగస్వామ్యం కొనసాగించాలనే ఉత్సాహం చూపడంలేదని పేర్కొన్నారు. అమెరికాను ఇప్పుడు సహకారమిచ్చే దేశంగా కాకుండా, విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో చైనా పట్ల అనేక దేశాల ఆసక్తి పెరుగుతోందని, భారత్‌ కూడా దానికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచిందని వివరించారు.

వివరాలు 

 చైనాతో భారత్‌ మరింత దగ్గర కావాలని చూస్తోంది: సుల్లివన్‌

న్యూదిల్లీపై ట్రంప్‌ భారీగా సుంకాలు విధించడంతో ఇరుదేశాల మధ్య ఉన్న బంధాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల భారత్‌ బీజింగ్‌తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. "ప్రపంచవ్యాప్తంగా అమెరికా బ్రాండ్‌ ప్రతిష్ఠ పూర్తిగా క్షీణించింది. భారత్‌పై ట్రంప్‌ భారీ వాణిజ్య దాడి చేశారు. దాంతో న్యూదిల్లీ,అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో మరింత దగ్గర కావాలని చూస్తోంది" అని సుల్లివన్‌ స్పష్టం చేశారు.

వివరాలు 

వ్యక్తిగత కోపంతోనే ట్రంప్‌ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు: జెఫరీస్‌

రష్యా నుంచి చమురు దిగుమతి చేస్తున్నారనే కారణంతోనే భారత్‌పై ట్రంప్‌ 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో ఇరుదేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల సమయంలో మధ్యవర్తిత్వానికి భారత్‌ క్రెడిట్‌ ఇవ్వకపోవడమే ట్రంప్‌ ఆగ్రహానికి అసలు కారణమని అమెరికా ఫైనాన్షియల్‌ సంస్థ జెఫరీస్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత కోపంతోనే ట్రంప్‌ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించారని ఆ సంస్థ విశ్లేషణలో స్పష్టంచేసింది.