Kash Patel: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు.
శుక్రవారం (అమెరికా కాలమానం ప్రకారం) శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అటార్నీ జనరల్ పామ్ బోండీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రధానంగా కాష్ భగవద్గీతపై ప్రమాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి కాష్ పటేల్ గర్ల్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్‌కిన్స్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ప్రమాణస్వీకారం సందర్భంగా విల్‌కిన్స్ భగవద్గీతను పట్టుకోగా, దానిపై చేయి ఉంచి పటేల్ ప్రమాణం చేశారు.
అనంతరం మాట్లాడిన ఆయన, ఎఫ్‌బీఐ లోపల, వెలుపల జవాబుదారీతనం పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Details
వెయ్యి మంది ఉద్యోగుల బదిలీ
బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్న కాష్, ఎఫ్‌బీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాల్లోని ఫీల్డ్ ఆఫీసులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు.
మరో 500 మందిని అలబామాలోని హంట్స్‌విల్లే బ్యూరోకు పంపించనున్నట్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, తన పాలనలో భారత సంతతికి చెందిన పలువురికి పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ట్రంప్ అత్యంత విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందిన కష్యప్ పటేల్‌ను ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా నామినేట్ చేశారు.
ఈ నామినేషన్‌ను సెనెట్ 51-49 ఓట్ల తేడాతో ఆమోదించడంతో, ఆయన బ్యూరో 9వ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కాష్ పటేల్ కుటుంబ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి.
Details
1980లో న్యూయార్క్ లో జననం
1980లో న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో జన్మించిన కాష్, యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్, యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్య పూర్తి చేశారు.
తొలుత ఓ న్యాయ సంస్థలో చేరాలనుకున్నా, అవకాశాలు రాకపోవడంతో మియామీ కోర్టులో పబ్లిక్ డిఫెండర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
ఆపై జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసి, ప్రతినిధుల సభలోని కమిటీ ఆఫ్ ఇంటెలిజెన్స్‌లో చేరారు. 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తులో సాయపడిన ఆయన, అప్పుడే డొనాల్డ్ ట్రంప్ దృష్టిలో పడ్డారు.
దీంతో, ట్రంప్ తన పరిపాలనా వ్యవస్థలో అత్యంత కీలక స్థానమైన ఎఫ్‌బీఐ డైరెక్టర్ హోదాను కాష్ పటేల్‌కు అప్పగించగా, బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.