
US-Pakistan: 'అసిమ్ మునీర్,ఒసామా బిన్ లాడెన్ కు పెద్ద తేడాలేదు' : అమెరికా అధికారి తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు.
ఈ దాడి నేపథ్యంలో అమెరికాకు చెందిన ఒక మాజీ అధికారి స్పందించారు.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌ను ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మాజీ నేత ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చుతూ, వారిద్దరి మధ్య పెద్ద తేడా లేదని పెంటగాన్‌కి చెందిన మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు.
ఒసామా బిన్ లాడెన్ అప్పట్లో గుహల్లో దాక్కుండేవాడైతే, ఇప్పుడు మునీర్ అలిషాన్ ప్యాలెస్‌లో ఉంటున్నాడని, అదే తేడా అని రూబిన్ స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికా పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ప్రకటించాలి
అదే సమయంలో,రూబిన్ మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగిందని గుర్తుచేశారు.
ఇప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉన్న సమయంలోనే పహల్గాం దాడి చోటుచేసుకోవడం అనుకోకుండా జరగలేదని సూచించారు.
ఈ దాడిపై పాకిస్థాన్ తాము సంబంధం లేదని చెబుతూ, ఇది స్థానికుల చర్య అని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు.
పాక్ ఇలా ఎన్ని కథలు చెప్పినా, ఆ దేశ అసలు స్వభావం ప్రపంచానికి తెలిసిపోయిందని విమర్శించారు.
మైఖేల్ రూబిన్ సూచించిన ప్రకారం, ఈ దాడికి ప్రతిస్పందనగా అమెరికా పాక్‌ను ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశంగా ప్రకటించాలి, అలాగే మునీర్‌ను ఉగ్రవాదిగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
వివరాలు
ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు
పహల్గాం పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో మంగళవారం సాయంత్రం ఈ దాడి జరిగింది.
సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు అకస్మాత్తుగా అక్కడికి చేరుకొని పర్యాటకులపై కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనకు కొద్దిరోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల అనంతరం దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన భారత్‌పై తీవ్రమైన ద్వేషభావంతో ఉండే వ్యక్తిగా పేరుంది. ఆయన వ్యాఖ్యలు కూడా ఉగ్రవాద చర్యలకు ఊతమిచ్చేవే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఓవర్సీస్ పాకిస్తానీల సమావేశంలో మాట్లాడిన మునీర్, కశ్మీర్ పాకిస్థాన్ జీవనాడిగా ఉంది, ఎప్పుడూ అలాగే ఉంటుంది అని ప్రకటించారు.
వివరాలు
వారిని ఒంటరిగా వదిలిపెట్టము
"కశ్మీరీ సోదరుల పోరాటంలో మేము వారిని ఒంటరిగా వదిలిపెట్టము" అని ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఆయన వ్యాఖ్యల అనంతరం తక్షణమే ఈ ఉగ్రదాడి జరగడం సగటు ప్రజానీకంలో ఆందోళన కలిగించింది.