Page Loader
Israel-Iran: అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!
అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!

Israel-Iran: అణు స్థావరాలపై దాడులు.. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తతలతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ పరస్పర దాడుల వల్ల అక్కడ భీకర వాతావరణం ఏర్పడింది. ఇజ్రాయెల్‌ దళాలు ఇప్పటికే ఇరాన్‌లోని అణు స్థావరాలు, మిలటరీ అధికారుల నివాస ప్రాంతాలు, శాస్త్రవేత్తల నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకొని గగనతల దాడులకు దిగాయి. దీనికి ప్రతిగా ఇరాన్‌ అత్యాధునిక క్షిపణులతో ఇజ్రాయెల్‌పై భారీ స్థాయిలో దాడి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్‌ అప్రమత్తమైంది. తమ దేశంలోని యూదులు, అమెరికన్లు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Details

అమెరికన్ పౌరుల భద్రతకు ప్రాధాన్యం

ముఖ్యంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, విద్యా సంస్థలు, రద్దీ ప్రాంతాలు, మతపరమైన సమావేశాలు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి బ్రూనో అధికారులను ఆదేశించారు. ఇరాన్‌ గతంలోనే ఇజ్రాయెల్‌ పౌరులపై దాడులకు వెనకాడమని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా, ఫ్రాన్స్‌ విదేశీ పౌరులపై ముప్పు పొంచి ఉన్నదని భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు యుద్ధానికి పరోక్షంగా అమెరికానే కారణమని ఇరాన్‌ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే ఫ్రాన్స్‌ దేశంలోని అమెరికన్‌ పౌరుల భద్రతకూ ప్రాధాన్యం ఇస్తోంది.

Details

యుద్దంతో తమకు ఎలాంటి సంబంధం లేదు : అమెరికా

ఇదిలా ఉంటే, ఇరాన్‌-అమెరికా మధ్య జరుగుతున్న అణు ఒప్పంద చర్చల ఆరో విడత ఒమన్‌ వేదికగా జరగాల్సి ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో చర్చలు రద్దయ్యాయి. ఈ యుద్ధానికి తమకు సంబంధం లేదని అమెరికా ఖండించింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ కలిగించాయి. ఎలాంటి దాడి జరిగినా తగిన శక్తితో స్పందిస్తామని, కనీవినీ ఎరుగని తీరులో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా ఉద్రిక్తత మరో ఘర్షణకు దారి తీసే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.