Baloch Militants Hijack Train: పాకిస్తాన్‌లో రైలును హైజాక్.. 120 మందికి పైగా బందీలు.. 6 మంది సైనికులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లో రైలు హైజాక్‌కు గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో వేర్పాటువాదులు ప్రయాణికుల రైలుపై దాడి చేసి, వందల మందిని బందీలుగా తీసుకున్నట్లు ప్రకటించారు.
ఈ ఘటన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని పెషావర్ వెళ్లే మార్గంలో చోటుచేసుకుంది.
రైలు హైజాక్, కాల్పుల మోత
పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై వేర్పాటువాదులు భారీ కాల్పులకు పాల్పడినట్లు బలోచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రిండ్ వెల్లడించారు.
ఘటన తెలిసిన వెంటనే, స్థానిక అధికారులకు అత్యవసర చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ దాడికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బాధ్యత స్వీకరించింది. తాము బందీలుగా తీసుకున్నవారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ప్రకటించింది.
వివరాలు
పక్కా ప్లానింగ్‌తో దాడి
BLA మిలిటెంట్లు పక్కా ప్రణాళికతో ముందుగా రైల్వే ట్రాక్‌ను పేల్చివేసి, జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు.
వెంటనే రైలును తమ నియంత్రణలోకి తీసుకుని, అందరినీ బందీలుగా మార్చేశారు. ఈ దాడిలో ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతిచెందినట్లు BLA ప్రకటించింది.
తమపై మిలిటరీ ఆపరేషన్ చేపడితే బందీలను హతమార్చుతామని హెచ్చరించింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ కూడా గాయపడినట్లు సమాచారం.
సహాయక చర్యలు, భద్రతా బలగాల మోహరింపు
ప్రస్తుతం ఘటనాస్థలికి భద్రతా బలగాలు చేరుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దుండగుల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
తీవ్రవాద దాడులు పెరుగుతున్న పరిస్థితి
బలోచిస్థాన్ వేర్పాటువాదులు పాకిస్థాన్‌లో వరుసగా దాడులకు పాల్పడుతున్నారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే మార్గాలు, వాహనాలపై దాడులు చేస్తున్నారు.
ప్రధాన రహదారులను మూసివేసి, బస్సు ప్రయాణికులను గుర్తింపు కార్డుల ఆధారంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
BLA, బలోచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం
బలోచిస్థాన్ ప్రజల స్వయంనిర్ణయాధికారం కోసం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై BLA 2000 నుంచి పాకిస్థాన్ సైన్యంపై దాడులు నిర్వహిస్తోంది.
ఈ గ్రూపును పాకిస్థాన్‌తో పాటు అమెరికా, యూకే ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.
వివరాలు
సిపెక్ ప్రాజెక్ట్‌పై ప్రభావం
బలోచిస్థాన్ ప్రాంతం నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్‌లలో విస్తరించి ఉంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) బలోచిస్థాన్ ద్వారా వెళ్తుండటమే ఇక్కడి వేర్పాటువాద దాడులకు ప్రధాన కారణం.
పాక్ ప్రభుత్వం దీన్ని ఆర్థిక వృద్ధికి కీలకంగా చూస్తుంటే, బలోచ్ వేర్పాటువాదులు తమ వనరులను పాకిస్థాన్, చైనా దోచుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు.
బలోచులపై ఉక్కుపాదం, మానవ హక్కుల ఉల్లంఘనలు
BLA రెబెల్స్ ఇటీవల CPEC ప్రాజెక్టులపై, ముఖ్యంగా చైనా ఉద్యోగులపై దాడులు పెంచారు.
పాకిస్థాన్ ప్రభుత్వం బలోచ్ వేర్పాటువాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
అంనెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం, 2011 నుంచి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలు అదృశ్యమయ్యారు.
వివరాలు
పాక్ భద్రతా పరిస్థితిపై సందేహాలు
పాకిస్థాన్‌లో బలోచిస్థాన్ వేర్పాటువాదులు రెచ్చిపోతుండటం, ముఖ్యంగా CPEC ప్రాజెక్టుపై ప్రభావం చూపించే విధంగా ఈ దాడులు పెరుగుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
హైజాక్ ఘటనతో మరోసారి పాక్ భద్రతా పరిస్థితిపై సందేహాలు తలెత్తుతున్నాయి.