Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై తులసీ గబ్బార్డ్ వ్యాఖ్యలు.. ఖండించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి.
ఆమె చేసిన వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
సరైన ఆధారాలు లేకుండా,తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆ ప్రభుత్వం పేర్కొంది.
ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల గురించి ప్రశ్నించగా,గబ్బార్డ్ స్పందించారు.
'బంగ్లాదేశ్‌లో హిందువులు,ఇతర మైనారిటీలు దాడులకు గురవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి, ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే విషయం.ఈ అంశంపై ట్రంప్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు'అని తెలిపారు.
ఈ సందర్భంగా, ఆమె బంగ్లాదేశ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
వివరాలు
బంగ్లాదేశ్ కూడా తీవ్రవాద సవాళ్లను ఎదుర్కొంటుంది
ఈ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
'తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆమె మాటలతో అన్యాయమైన రీతిలో దేశానికి మరకలు అంటించే ప్రయత్నం జరిగింది. సరైన ఆధారాలు లేకుండా ఆమె ఈ ఆరోపణలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల మాదిరిగా బంగ్లాదేశ్ కూడా తీవ్రవాద సవాళ్లను ఎదుర్కొంటుంది. మా భాగస్వామ్య దేశాల మద్దతుతో వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం వాస్తవాలకు ఆధారంగా, సార్వభౌమాధికారాన్ని, భద్రతా వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చర్చలకు కట్టుబడి ఉంది' అని స్పష్టం చేసింది.
వివరాలు
ఉద్రిక్తతలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు
అలాగే, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఏ విధమైన ప్రకటనలు చేసినా, అవి వాస్తవాలను ఆధారంగా ఉంచుకుని ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పౌరుల్లో ఆందోళనలు రేకెత్తించేలా, మతపరమైన ఉద్రిక్తతలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది.