LOADING...
Bangladesh: ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన
ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన

Bangladesh: ఫిబ్రవరి 2026 లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు.. ముహమ్మద్ యూనస్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ, పార్లమెంట్ ఎన్నికలకు తుది ముహూర్తం ఖరారయ్యింది. తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ ఈ మేరకు జాతినుద్దేశించి మంగళవారం (ఆగస్ట్ 5) ప్రసంగించారు. గత సంవత్సరం జూలై నెలలో విద్యార్థులు చేపట్టిన "జూలై తిరుగుబాటు" ఉద్యమం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మహ్మద్ యూనస్ 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రంజాన్ మాసం ప్రారంభానికి ముందే ఎన్నికలు ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలిపారు. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు తాను అధికారికంగా లేఖ రాస్తానని వెల్లడించారు.

వివరాలు 

 ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రధాన ప్రాధాన్యత 

ఎన్నికలు పూర్తిగా నిష్పాక్షికంగా, శాంతియుత వాతావరణంలో జరగేలా తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని యూనస్ హామీ ఇచ్చారు. దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును వినియోగించుకునేలా, అధిక ఓటింగ్ శాతంతో ఎన్నికలు నిర్వహించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆయన సూచించారు. వారి కోసం ప్రత్యేక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చాలని పిలుపునిచ్చారు.

వివరాలు 

ప్రజలు, రాజకీయ పార్టీలు, సైన్యం నుంచి ఎన్నికల నిర్వహణపై ఒత్తిడి

ఇదిలా ఉండగా, 2024 జూలై, ఆగస్టు నెలలలో విద్యార్థులు ప్రభుత్వ రిజర్వేషన్ల విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలేర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించి తీవ్ర హింసాత్మక దశకు చేరుకున్నాయి. ఫలితంగా షేక్ హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి తాత్కాలిక ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇప్పుడు, దేశ వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీలు, సైన్యం నుంచి ఎన్నికల నిర్వహణపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, మహ్మద్ యూనస్ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని తుది నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి ప్రజా ప్రతినిధి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.