Bangladesh unrest: మత స్వేచ్ఛ, మానవ హక్కులను గౌరవించాలి.. బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన
బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఘర్షణాత్మక పరిణామాలపై అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను అణగదొక్కే చర్యలకు తావులేదని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. మైనారిటీలపై దాడులు జరుగుతున్న సందర్భంలో, మత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా స్పష్టంచేసింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ డిసెంబర్ 4న మీడియాతో మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలని, నిర్బంధంలో ఉన్నవారికి మానవ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగకుండా చూడాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
మైనారిటీలపై దాడులు తీవ్రరూపం
ఇక బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో నుంచి తప్పుకుని మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీలపై దాడులు తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఇటీవల హిందూ మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను అరెస్టు చేయడంతో పాటు, ఆయన తరపున కేసు వాదించిన న్యాయవాదిపైనా దాడి జరగడం దేశంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ఇలాంటి పరిస్థితులపై అమెరికా గట్టిగా స్పందిస్తూ, మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచ దేశాలంతా కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.