canada: 'భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో భారీ క్షీణత.. బలపడాలంటే రాత్రికి రాత్రి అయ్యే పనికాదు'
ఇండియా, కెనడా దౌత్య సంబంధాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేనంత రీతిలో ఇరు దేశాల మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయి. ఇటీవలే వీసా సేవలను పాక్షికంగా పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది. అయినప్పటికీ భారత్, కెనడాల మధ్య పాడైపోయిన దౌత్య సంబంధాల్లో ప్రతిష్ఠంభన చాలా కాలం పాటు కొనసాగుతుందని విదేశీశాఖ అధికారులు,నిపుణులు అంటున్నారు. పంజాబ్‌కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని కెనడా చేసిన ఆరోపణలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం వీసా సేవల నిలిపివేత, దౌత్య సిబ్బంది తొలగింపు వంటివి చోటు చేసుకున్నాయి. ఆయా సంఘటనలు తర్వాత వారం రోజుల కిందట వీసా సేవలను పాక్షికంగా పునరుద్ధరించాలని భారత్ నిర్ణయించింది.
గతంలో ఎన్నడూ లేని రీతిలో సంబంధాలు దిగజారాయన్న మైఖేల్
వీసాలపై భారత్ ఆంక్షల సడలింపు ఎత్తివేతతో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం హస్తం అందించే దిశగా కొనసాగింది. అయితే ఈ చర్య ఇరు దేశాల మధ్య కొత్త ఆశాలను చిగురింపజేసినప్పటికీ పురోగతి మాత్రం సాధ్యం కాలేదు. దెబ్బతిన్న దౌత్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఇరువైపులా పెద్దగా ప్రోత్సాహం లేవని రెండు దేశాల అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో సంబంధాలు దిగజారాయని వాషింగ్టన్ విల్సన్ సెంటర్‌లోని సౌత్ ఏషియా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్ అన్నారు. ఓవైపు కెనడా హత్య దర్యాప్తు,మరోవైపు భారత్ లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నందున దిల్లీ లేదా ఒట్టావా ఇరుదేశాల మధ్య రిలేషన్స్ పునరుద్దరణపై చర్యలు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది.