Joe Biden:జో బైడెన్ కీలక నిర్ణయం..ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లో పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని రష్యా తీవ్ర దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్కో దాడుల నుండి కీవ్‌ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించనున్నట్లు ప్రకటిస్తూ, ఈ విషయంపై రక్షణ మంత్రిత్వ శాఖకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రష్యా దాడుల వెనుక ఉద్దేశం ఉక్రెయిన్ ప్రజలను చలికాలంలో కష్టాల్లో పడేలా చేయడం, విద్యుత్ సరఫరా అందకుండా గ్రిడ్ వ్యవస్థను ధ్వంసం చేయడమేనని బైడెన్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్‌కు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు
మరి కొద్దీ రోజులలో బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి త్వరలో వైదొలగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించాలనే ఉద్దేశంతో వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించిన బైడెన్ ప్రభుత్వం, అదనంగా 988 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించనున్నట్లు హామీ ఇచ్చింది. 2022 నుంచి ఇప్పటి వరకు అమెరికా ఉక్రెయిన్‌కు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించినట్లు సమాచారం.
70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు
ఇటీవలి కాలంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేసింది. అదే సమయంలో ఉత్తరకొరియా దళాలు మాస్కోకు మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కీవ్ తనను రక్షించుకునేందుకు బైడెన్ కార్యవర్గం పెద్ద మొత్తంలో ఆయుధాలను అందిస్తోంది. క్రిస్మస్ పర్వదినాన కూడా రష్యా ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో దాడులు నిర్వహించింది. అయితే, వాటిలో 50 క్షిపణులు, పలు డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు.