గాజాలో మారణ హోమం.. అరబ్ దేశాల నాయకులతో జో బైడైన్ సమావేశం రద్దు
ఇజ్రాయెల్-హమాస్ దాడులతో గాజా నగరం శవాల దిబ్బగా మారుతోంది. తాజాగా గాజాలోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో దాదాపు 500 మంది చనిపోయినట్లు హమాస్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఆస్పత్రిపై జరిగిన దాడి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యేంలో జోర్డాన్‌లోని అమ్మాన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో బుధవారం జరగాల్సిన అరబ్ దేశాల నాయకుల సమావేశం రద్దు అయ్యింది. హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపేందుకు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు బుధవారం వస్తున్నారు. అనంతరం జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిస్సీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌లతో బైడెన్ సమావేశం కావాల్సి ఉంది.
ఆస్పత్రిపై దాడికి అమెరికా బాధ్యత వహించాలి: హమాస్
గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై దాడిని హమాస్- ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడి వల్లే ఆస్పత్రి ధ్వంసమైందని హమాస్ ఆరోపించింది. అయితే హమాస్ మిలిటెంట్లు రాకెట్‌ను సరిగా పేల్చకపోవడం వల్లే అది ఆస్పత్రి వైపు దూసుకెళ్లినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా ఈ దాడికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రిపై దాడిని ఇజ్రాయెల్ క్రూరత్వాన్ని, ఆ దేశ ఓటమి భయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలందరూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరపాలని ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, టర్కీలు గాజా నగరంలోని అల్-అహ్లీ అరబ్ హాస్పిటల్‌పై దాడిని తీవ్రంగా ఖండించాయి.