G-20 Summit: బ్రెజిల్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. సంస్కృత మంత్రాలతో స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 16) సాయంత్రం మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన జీ-20 సదస్సు నిర్వహించే బ్రెజిల్‌తో పాటు, నైజీరియా, గ్వామ్ దేశాలను కూడా సందర్శించనున్నారు. తాజాగా, సోమవారం తెల్లవారు జామున ప్రధాని మోదీ బ్రెజిల్‌కు చేరుకున్నారు. ఈ రోజు రియో డి జనెరోలో జరిగే జీ-20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా, వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో, బ్రెజిల్‌లోని భారత సంతతికి చెందిన ప్రజలు, బ్రెజిల్ అధికారులు, నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రియో డి జనెరోలో,బ్రెజిల్ ప్రజలు సంస్కృత మంత్రాలతో మోడీని స్వాగతించారు. అందరూ కలసి ఒకే సారి మంత్రోచ్ఛరణ చేసిన దృశ్యం ఆకట్టుకుంది.
19వ తేదీన గయానాకు మోదీ
జీ-20 సదస్సులో పాల్గొనే వారిలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఉంటారు. గత సంవత్సరం భారతదేశంలో జీ-20 సదస్సు నిర్వహించగా, ఈ సంవత్సరం బ్రెజిల్‌లో జరుగుతుంది. వచ్చే సంవత్సరం దక్షిణాఫ్రికాలో జీ-20 శిఖరాగ్ర సమ్మిట్ జరగనుంది. బ్రెజిల్ పర్యటన ముగించుకున్న తర్వాత, ప్రధాని మోడీ 19వ తేదీన గయానాకు వెళ్లనున్నారు. అక్కడి అధ్యక్షుడు మొహమద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానించిన నేపథ్యంలో, 21వ తేదీ వరకు ఆయన గయానాలో అధికారిక పర్యటన కొనసాగించనుంది. 17 ఏళ్ల తర్వాత నైజీరియాలో, 1968 తర్వాత గయానాలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీనే కావడం విశేషం.