నిజ్జర్ హత్యపై కెనడాకు నిఘా సమాచారాన్ని అందించిన అమెరికా ఇంటెలిజెన్స్.. న్యూయార్క్ టైమ్స్ వెల్లడి
ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం భారత్-కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని, తమ దగ్గర నిఘా సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే కెనడాను ఆ నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ అందించినట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' రాసుకొచ్చింది. కెనడాలోని యూఎస్ రాయబారి డేవిడ్ కోహెన్ కూడా దీన్ని దృవీకరించారు. నిజ్జర్ హత్య తర్వాత నిఘా కూటమిలో భాగస్వామి అయిన కెనడాతో గూఢచార సమాచారాన్ని పంచుకున్నట్లు వెల్లడించారు. అయితే నిఘా సమాచారం పంచుకున్న విషయం అమెరికా ప్రభుత్వానికి తెలియదని న్యూయార్క్ టైమ్స్‌చెప్పడం కొసమెరుపు.
ఆ ఇద్దరు అధికారులు ఎవరు?
'ఫైవ్ ఐస్' అనే నిఘా కూటమిలో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఇద్దరు అధికారులు నిజ్జర్ హత్యకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కెనడాకు అందించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ట్రూడో ఆరోపణలు భారత్ దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరు అధికారులు ఎవరనేది వార్తాపత్రిక వెల్లడించలేదు. ఈ ఇద్దరు అధికారులు ఏ ఏజెన్సీలో పనిచేస్తున్నారో కూడా చెప్పలేదు.
కెనడా -భారతదేశం దౌత్యపోరులో అమెరికా తలదూర్చకపోవచ్చు: నిపుణుడు
ఇదిలా ఉంటే, కెనడా -భారతదేశం మధ్య దౌత్యపరమైన వివాదం విషయంలో అమెరికా పాత్రపై రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చార్లెస్ మైయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా -భారతదేశం మధ్య వివాదానికి అమెరికా దూరంగా ఉండటానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. దౌత్య పోరులో అమెరికా ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని, అందుకే భారత్, కెనడాల మధ్య సమదూరం పాటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో, అమెరికా- భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడింది. చైనాకు అడ్డుకట్ట వేసేందుకు అమెరాకు భారత్ మద్దతు చాలా కీలకం. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని చార్లెస్ మైయర్స్ అభిప్రాయపడ్డారు.