Page Loader
India-Canada: నిజ్జర్‌ హత్య కేసు.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి భారత్‌ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు 
నిజ్జర్‌ హత్య కేసు.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి భారత్‌ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు

India-Canada: నిజ్జర్‌ హత్య కేసు.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి భారత్‌ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మను అనుమానితుల జాబితాలో చేర్చిన కెనడా, తాజాగా మరో ఆరోపణతో ముందుకొచ్చింది. ఈసారి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో భారత్‌పై మరోసారి విమర్శల వర్షం కురిపించింది. కెనడా రాయల్‌ మౌంటెడ్‌ పోలీసులు మీడియా సమావేశంలో, ఆర్‌సీఎంపీ అసిస్టెంట్‌ కమిషనర్‌ బ్రిగిట్టె గౌవిన్‌ సంచలన ఆరోపణలు చేశారు. భారత ఏజెంట్లు కెనడా భూభాగంలో నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలు చేశారు. దక్షిణాసియా కమ్యూనిటీ, ప్రో-ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని, భారత ఏజెంట్లు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి వ్యవస్థీకృత నేరాల్లో పాల్గొంటున్నారని ఆమె పేర్కొన్నారు.

Details

తీవ్రంగా స్పందించిన భారత్

అయితే ఈ ఆరోపణల గురించి ఏవైనా సాక్ష్యాలను మాత్రం కెనడా అధికారులు సమర్పించలేదు. కనీసం ఇటీవల మహారాష్ట్ర ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్యతో వార్తల్లో నిలిచిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరు ఈ సందర్భంలో ప్రస్తావించడమే కాదు, కెనడా అధికారుల తాజా ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత దుమారం రేపాయి. బిష్ణోయ్‌ జైల్లో ఉన్నప్పటికీ, అతడి గ్యాంగ్‌ అనుచరులు కెనడాలో కేంద్రీకరించి నేరకార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. నిజ్జర్‌ హత్య కేసు దర్యాప్తుపై భారత్‌ సహకరించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు చేయడం, రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దూరంగా తీసుకెళ్లాయి. దీనిపై భారత్‌ కఠినంగా స్పందించింది. కెనడా సాక్ష్యాల లేమితో అనవసర విమర్శలు చేస్తోందని మండిపడింది.