Canada: అవిశ్వాస తీర్మానంలో జస్టిన్ ట్రూడో విజయం
కెనడాలోని మాంట్రియల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ ఓటమి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఓటమి నేపథ్యంలో ఆయనపై సొంత పార్టీ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ఈ పరిస్థితిని క్యాష్ చేసుకుంటూ, అధికారంలో ఉన్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే తాజాగా నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో జస్టిన్ ట్రూడో విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో 211 మంది లిబరల్ పార్టీకి మద్దతు ప్రకటించారు, దాంతో ట్రూడో విజయం సాధించగలిగారు. అయినప్పటికీ కన్జర్వేటివ్ నాయకులు త్వరలోనే ప్రభుత్వం కూల్చి వేస్తామని హెచ్చరించారు.
ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు
"ఈ రోజు కెనడాకు మంచి జరిగింది. కెనడియన్లు ఎన్నికలు కోరుకుంటున్నారని నేను భావించడం లేదు. మేము వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతూ, అవసరమైన చట్టాలను రూపొందిస్తున్నాం" అని ప్రభుత్వ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సీనియర్ లిబరల్ కరీనా గౌల్డ్ అన్నారు. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజల ఖర్చులు, పన్నులు, నేరాలు పెరిగాయని, ట్రూడో ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బ్లాక్ నాయకుడు వైవ్స్-ఫ్రాంకోయిస్ బ్లాంచెట్, పాడి రైతుల కోసం సుంకాలు, కోటాల వ్యవస్థను పరిరక్షించడం, అనుభవజ్ఞులకు ఎక్కువ డబ్బు ఇవ్వడం ద్వారా ట్రూడో డిసెంబర్ వరకు అధికారంలో ఉండగలడని పేర్కొన్నారు.
ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ వెనుకంజ
కెనడాలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం నిర్వహించిన సర్వేలు ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ వెనుకంజలో ఉందని సూచిస్తున్నాయి. వలసల వల్ల నిరుద్యోగం పెరిగిందని, ఈ కారణంగా స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి తోడు మాంట్రియల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఓటమి చెందింది. ఇక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ ఇబ్బందుల్లో పడటం ఖాయమని సర్వేలు ఉఠంకిస్తున్నాయి.