Canada: ట్రూడోతో విభేదాల కారణంగా ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా.. ప్రధాని పై విమర్శలు
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ఉప ప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కేబినెట్‌లో అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన ఆమె, ట్రూడో ప్రజాదరణ కోల్పోతున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి ట్రూడో ఆర్థిక శాఖ మార్పులను ప్రకటించిన నేపథ్యంలో, తన రాజీనామానే సరైన నిర్ణయంగా భావించినట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖలో క్రిస్టియా ఫ్రీలాండ్, దేశం ప్రస్తుతం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితుల్లో, ఇలాంటి ముప్పును దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరమని సూచించారు.
ట్రూడో కేబినెట్‌లో కీలక భూమిక
గత కొన్ని వారాలుగా ఉత్తమ పరిష్కారాల కోసం ట్రూడోతో చర్చలు జరిగినప్పటికీ, వారి మధ్య భిన్నాభిప్రాయాలు పెరిగాయని తెలిపారు. అయితే, ఆమె లిబరల్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతారని, టొరంటో నుంచి తదుపరి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు. 2013లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన క్రిస్టియా, ఆ తరువాత ట్రూడో కేబినెట్‌లో కీలక భూమిక పోషించారు. వాణిజ్య,విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేసిన ఆమె, ఆగస్టు 2020 నుంచి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లతో స్వేచ్ఛా వాణిజ్య చర్చలకు నాయకత్వం వహించిన ఆమె, ఆర్థిక పరమైన కీలక అంశాలపై పార్లమెంట్‌లో ప్రసంగించడానికి సిద్ధమవుతున్న సమయంలో తన రాజీనామాను ప్రకటించటం గమనార్హం.
జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోకపోతే కెనడాపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం, లేదా అమెరికా 51వ రాష్ట్రంగా చేరాల్సిందేనని చురకలు అంటించడం రాజకీయంగా ఒత్తిడిని మరింత పెంచింది. ఈ అంశాల్లో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని జస్టిన్ ట్రూడోపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రూడో, క్రిస్టియా మధ్య భేదాభిప్రాయాలు మరింత తీవ్రతరమయ్యాయి. క్రిస్టియా తన రాజీనామా లేఖలో కూడా ఈ అంశాలను ప్రస్తావించారు.