Page Loader
Nijjar murder Case: కెనడాలో నిజ్జర్‌ హత్య కేసులో అరెస్ట్ అయ్యిన నలుగురు భారతీయలకు బెయిల్‌
కెనడాలో నిజ్జర్‌ హత్య కేసులో అరెస్ట్ అయ్యిన నలుగురు భారతీయలకు బెయిల్‌

Nijjar murder Case: కెనడాలో నిజ్జర్‌ హత్య కేసులో అరెస్ట్ అయ్యిన నలుగురు భారతీయలకు బెయిల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటన కారణంగా భారత్-కెనడా మధ్య ఏర్పడిన దౌత్య విభేదాలు అందరికీ తెలిసిందే. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన టొరంటో పోలీసులు గత ఏడాది నలుగురు భారతీయులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. తాజాగా, వీరికి కెనడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనలో భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ,వాటిని సమర్థించే ఆధారాలను సమర్పించాలని, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టం చేసింది.

వివరాలు 

కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ

నిజ్జర్ హత్య కేసులో ఫస్ట్ డిగ్రీ అభియోగాలపై కరణ్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్, అమర్‌దీప్ సింగ్‌ను 2022 మేలో కెనడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ఎడ్మంటన్ ప్రాంత వాసులు కాగా, అమర్‌దీప్ బ్రాంప్టన్ నివాసి. జైలులో ఉన్న వీరికి దిగువ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఈ కేసు విచారణను బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తూ, తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 11న నిర్వహించనుందని ప్రకటించారు.

వివరాలు 

అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ

ఈ కేసు నేపథ్యంలో, కెనడా ప్రభుత్వం భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును అనుమానితుల జాబితాలో చేర్చడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనిపై భారత్ సంజయ్ వర్మ సహా ఇతర దౌత్యవేత్తలను వెనక్కి పిలిచింది. అదే సమయంలో, భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించడంతో, ఒట్టావా కూడా మన దౌత్యవేత్తలపై ప్రతిస్పందన చర్యలు చేపట్టింది.