Page Loader
Canada: మా దేశం నుంచే ఖలిస్తానీ కుట్రలు.. నిర్ధారించిన కెనడియన్ ఇంటెల్ ఏజెన్సీ  

Canada: మా దేశం నుంచే ఖలిస్తానీ కుట్రలు.. నిర్ధారించిన కెనడియన్ ఇంటెల్ ఏజెన్సీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా స్థావరంగా మారుతోందని న్యూఢిల్లీ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఆరోపణలను పెద్దగా పట్టించుకోని ఒట్టావా సర్కారు, తాజా సంఘటనల నేపథ్యంలో కీలకంగా స్పందించింది. ఖలిస్థానీ అతివాదులు నిజంగా కెనడా నేల నుంచే కుట్రలు పన్నుతున్నారని కెనడా తాజాగా అంగీకరించింది. ఈ మేరకు తమ వార్షిక భద్రతా నివేదికలో కెనడియన్‌ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ (CSIS) కీలక విషయాలను వెల్లడించింది.

వివరాలు 

ఖలిస్థానీ అతివాదులు కెనడాను తాత్కాలిక స్థావరంగా ఉపయోగించుకుంటున్నారు

ఈ నివేదిక ప్రకారం, "భారతదేశంలో హింసకు ప్రోత్సాహం కల్పించేందుకు, దాడులకు నిధులు సమకూర్చేందుకు ఖలిస్థానీ అతివాదులు కెనడాను తాత్కాలిక స్థావరంగా ఉపయోగించుకుంటున్నారు" అని స్పష్టం చేసింది. ఖలిస్థానీ వేర్పాటువాదులను "అతివాదులు"గా అభివర్ణించిన సందర్భం ఇదే మొదటిసారి కావడం గమనించదగిన విషయం. పంజాబ్‌లో ప్రత్యేక ఖలిస్థాన్‌ అనే దేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ గుంపులు కుట్రలు చేస్తున్నట్లు నివేదిక స్పష్టంగా పేర్కొంది. భారత్‌-కెనడా మధ్య ఇటీవల ప్రధాన మంత్రుల భేటీ జరిగిన సమయంలోనే ఈ నివేదిక వెలుగులోకి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తున్నన్యూఢిల్లీ

ఖలిస్థానీ వేర్పాటువాదులు కెనడా గడ్డపై భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారని న్యూఢిల్లీ గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉంది. 1985లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన బాంబు దాడి ఘటనను గానీ, అనంతరం భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద చర్యలను గానీ ఆధారంగా చూపుతూ, ఈ విషయాలను పదే పదే ఒట్టావా దృష్టికి తీసుకెళ్లింది. కానీ అప్పటివరకు కెనడా ఈ ఆరోపణలపై పెద్దగా స్పందించలేదు. అయితే 2023లో ఖలిస్థానీ నేత హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

వివరాలు 

నరేంద్ర మోదీతో కార్నీ భేటీ

నిజ్జర్‌ హత్యకు భారత ఏజెంట్లే కారణమని అప్పటి ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం మార్క్‌ కార్నీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తాజాగా జరిగిన జీ7 సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో కార్నీ భేటీ అయ్యారు. దౌత్య సంబంధాలను మెరుగుపరచేందుకు ఇరు దేశాలు మళ్లీ తమ తమ హైకమిషనర్లను నియమించుకునేందుకు అంగీకరించాయి.