Page Loader
US: లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు
లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు

US: లాస్ ఏంజిల్స్ లో కార్లకు నిప్పు,రోడ్లపై US నేషనల్ గార్డ్.. తీవ్ర ఉద్రిక్తతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని నెలలుగా అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ విధానాలు అమలులో ఉన్నాయ్. తాజాగా లాస్ ఏంజిల్స్‌లో ఈ చర్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్కడ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయుగోళాలు, పెప్పర్ స్ప్రేలను ఉపయోగించగా, దానికి ప్రతిగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా వారు వాహనాలకు నిప్పుపెట్టడంతో పదుల సంఖ్యలో వాహనాలు దగ్ధమయ్యాయి. పరిస్థితి చెలరేగడంతో అధ్యక్షుడు ట్రంప్ వెంటనే 2 వేల మంది నేషనల్ గార్డులను రంగంలోకి దింపారు. ఇందుకు తోడుగా,కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ నూసమ్,లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

వివరాలు 

నేషనల్ గార్డ్స్‌ను మోహరించడంపై గవర్నర్ గావిన్ నూసమ్ అసంతృప్తి

ఆందోళనలను సమర్థవంతంగా అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. ఇకపై నిరసనకారులు ముఖానికి మాస్కులు ధరించేందుకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు. అయితే నేషనల్ గార్డ్స్‌ను మోహరించడంపై గవర్నర్ గావిన్ నూసమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం పరిస్థితిని మరింత ఉద్రిక్తతగా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ, ఫెడరల్ అధికారులు లేదా పోలీసులు ఎవరి పైనా దాడులు చేస్తే, వాళ్లను జైలుకి పంపడమే నిశ్చితమని హెచ్చరించారు.

వివరాలు 

వారం రోజుల వ్యవధిలో మొత్తం 118 మంది అరెస్ట్

ఇదే సమయంలో లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. గత వారం రోజుల వ్యవధిలో మొత్తం 118 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క శుక్రవారం రోజే 44 మంది అదుపులోకి వెళ్లారు. ఇదే సమయంలో ఘర్షణలు చెలరేగాయి. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన ఆందోళనకారులు ఫెడరల్ భవనం వద్ద చేరుకొని అతన్ని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. అక్రమ వలసదారులపై ప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగానే డేవిడ్ హుయెర్టా అరెస్ట్ జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

 ఘటనపై స్పదించిన మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ 

మరోవైపు లాస్ ఏంజిల్స్‌ నివాసితురాలు, మాజీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ, ఇమ్మిగ్రేషన్ అరెస్టులు, గార్డుల మోహరింపుతో ప్రజల్లో భయం, అయోమయం పెరుగుతోందని అన్నారు. ఇది సమాజాన్ని విభజించే విధంగా ఉందని, దీన్ని క్రూర చర్యగా ఆమె పేర్కొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలను కాపాడే వారికి తాను మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.