Sheikh Hasina: కేంద్రం కీలక నిర్ణయం.. షేక్ హసినా భారత్‌లో ఉండేందుకు మరింత సమయం
ఈ వార్తాకథనం ఏంటి
అనూహ్యంగా తన పదవిని కోల్పోయి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై స్వదేశంలో తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల్లో ఆమెను తమకు అప్పగించాల్సిందిగా ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఇప్పటికే సందేశం పంపించారు.
తాజాగా హసీనా పాస్‌పోర్టును రద్దు చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ హసీనా వీసా గడువును పొడిగించినట్లు సమాచారం.
ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ద్వారా వచ్చిన అభ్యర్థన ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Details
షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ కూడా జారీ
అయితే హసీనాకు శరణార్థిగా ఆశ్రయం కల్పించనున్నారన్న వార్తలను కేంద్రం ఖండించింది.
గతేడాది ఆగస్టులో జరిగిన ఉద్యమాల కారణంగా 16 ఏళ్లుగా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఈ నేపథ్యంలో హసీనా స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారు.
అయితే ఆమెపై బంగ్లాదేశ్‌లో అనేక కేసులు నమోదవడంతో పాటు అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, డిసెంబరులో బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వానికి దౌత్య సందేశం పంపింది.
Details
పాస్ పోర్టును రద్దు చేసిన బంగ్లా ప్రభుత్వం
ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అప్పట్లో స్పందించారు.
ఈ అంశంపై వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇంతలోనే బంగ్లా ప్రభుత్వం హసీనా పాస్‌పోర్టును మంగళవారం రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
హసీనా వీసా గడువు పొడిగింపు భారత్ ఆమెకు మరింత కాలం ఉండేందుకు అవకాశం కల్పించినప్పటికీ, ఈ వ్యవహారంపై ఇంకా రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.