Arunachal Pradesh- China: అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనా 30 కొత్త పేర్లు..
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సరిహద్దుల ప్రాంతాలు తమవిగా పేర్కొంటూ చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 30 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనీస్ భాషలో పెట్టి,ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఇక, ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అప్పటి నుంచి ఆ ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని డ్రాగన్ కంట్రీ స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండడం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని వెల్లడించింది.
అరుణాచల్ ప్రదేశ్ కి జిజాంగ్ అని పేరు మార్పు
ఈ నేపథ్యంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా పేర్కొందని గ్లోబల్ టైమ్స్ చెప్పుకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చైనా పేర్కొంటూ దానికి జిజాంగ్ అని పేరు పెట్టింది. కానీ ఇప్పుడు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 30 ప్రదేశాల పేరును మార్చినట్లు సమాచారం. దీనిని జంగ్నాన్ లేదా టిబెట్‌లో భాగమని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా లిస్టు విడుదల చేయడం ఇది నాలుగోసారి. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా చైనా వాటిని తేలిగ్గా తీసుకుంటోంది.