Iran-Israel Attack: చైనా, రష్యా మద్దతు.. యూఎన్‌లో ఇరాన్ ఎమర్జెన్సీ మీటింగ్
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య హోరాపోరీగా యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ వైమానిక స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడులతో ఇజ్రాయెల్ తమ లక్ష్యాలను సాధించినట్లు ప్రకటించింది, కానీ ఇరాన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో నలుగురు సైనికులు, ఒక పౌరుడు మరణించినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ దాడులపై చొరవగా ఇరాన్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. చైనా, రష్యా, అల్జీరియా మద్దతుతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించాలనే అంశంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి దృష్టి సారించారు. ఆయన శనివారం రాసిన లేఖలో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాలని 15 సభ్యుల భద్రతా మండలిని కోరారు.
ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకుంటాం : ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ గత అక్టోబర్ 26న ఖుజెస్తాన్, ఇలామ్, టెహ్రాన్ ప్రావిన్స్‌లోని ఇరాన్ రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడిలో నలుగురు ఇరాన్ సైనికులు మరణించారని, పౌరుల ప్రాణాలు కూడా పోయాయని ప్రకటించింది. మరో వైపు, అక్టోబర్ ప్రారంభంలో ఇరాన్ 180 క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. అవి ఇజ్రాయెల్ గగనతలంలోనే పేలిపోయాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ గత శనివారం ఈ దాడులకు తెగబడింది. ఇరాన్ ఇప్పటికే ఈ చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.