China: చైనా హెచ్చరిక.. తైవాన్ చుట్టూ బలగాల మోహరింపు
తైవాన్ సమీప సముద్ర జలాల్లో చైనా తన సైనిక దూకుడును పెంచింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో తైవాన్ చుట్టుపక్కల సైనిక చర్యలు చైనా చేపట్టింది. దీనిపై తాజాగా స్పందిస్తూ తమ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టం చేసింది. తైవాన్ చుట్టూ వేర్పాటువాద కార్యకలాపాలను ఏమాత్రం సహించమని చైనా తైవాన్ వ్యవహారాల విభాగం ప్రతినిధి ఝఫెంగ్లియాన్ హెచ్చరించారు. తైవాన్ వేర్పాటువాదులు బాహ్యశక్తులతో కుమ్మక్కవ్వడాన్ని తమ దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే చర్యగా బీజింగ్ పరిగణిస్తోంది.
మోహరింపుల వెనుక ఉన్న ఉద్దేశాలను వెల్లడించని చైనా
తైవాన్ జలసంధిలో సుస్థిరతను కాపాడేందుకు తమకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ఝఫెంగ్లియాన్ తెలిపారు. అయితే చైనా సైనిక దళం (పీఎల్ఏ) ఈ మోహరింపుల వెనుక ఉన్న ఉద్దేశాలను ఇంకా వెల్లడించలేదు. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్ తె ఇటీవల అమెరికాలోని హవాయి, గువామ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలతో చైనాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తైవాన్ చుట్టూ చైనా భారీ స్థాయిలో తన నౌకాదళాన్ని మోహరించిందని తైవాన్ మిలిటరీ వెల్లడించింది. తైవాన్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టుగా, అమెరికాలో కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న కార్యవర్గానికి రాజకీయ సందేశం పంపే ఉద్దేశంతోనే చైనా ఈ సైనిక చర్యలకు పాల్పడిందని అభిప్రాయపడుతున్నారు.
తీవ్రమైన ముప్పుగా పరిగణించిన తైవాన్
దాదాపు 70 రోజులపాటు ప్లానింగ్ తర్వాత చైనా ఈ విన్యాసాలు చేపట్టిందని తైవాన్ మిలిటరీ వెల్లడించింది. తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో బీజింగ్ తన నౌకాదళాన్ని మోహరించింది. ఇది చైనా గతంలో చేసిన యుద్ధ విన్యాసాలకు మించి తీవ్రమైన ముప్పుగా తైవాన్ మిలిటరీ గుర్తించింది. ఈ పరిణామాలు తైవాన్ చుట్టుపక్కల ఉద్రిక్తతలను మరింత పెంచడంతోపాటు, ఆ ప్రాంత సుస్థిరతపై ప్రశ్నార్హ పరిస్థితులను తలెత్తిస్తున్నాయి.