China: ట్రంప్ టారిఫ్ బెదిరింపు.. అమెరికా వ్యవసాయోత్పత్తులపై చైనా టార్గెట్.. గ్లోబల్ టైమ్స్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా టారిఫ్‌లకు ప్రతిస్పందించేందుకు చైనా సన్నద్ధమైందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
ఫెంటనిల్ ఎగుమతులకు ప్రతిగా, బీజింగ్‌పై అదనపు సుంకాలు విధిస్తున్నట్లు వాషింగ్టన్ గతంలో ప్రకటించింది.
దీనికి ప్రత్యుత్తరంగా, జిన్‌పింగ్ ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు, టారిఫేతర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ముఖ్యంగా, అమెరికా వ్యవసాయ, ఆహారోత్పత్తులు చైనా టార్గెట్‌లో ఉండే అవకాశముందని వెల్లడించింది.
అమెరికా ఏకపక్షంగా వ్యవహరించి టారిఫ్‌లు లేదా ఇతర ఆంక్షలు విధిస్తే, బీజింగ్ దానికి బలమైన ప్రతిస్పందన ఇవ్వబోతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలియజేసిందని గ్లోబల్ టైమ్స్ కథనంలో వెల్లడైంది.
వివరాలు
తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన జిన్‌పింగ్ కార్యవర్గంలోని పలువురు మంత్రులు
గత గురువారం, ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, మెక్సికో మరియు కెనడాపై మార్చి 4వ తేదీ నుండి అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే, చైనాపై కూడా 10%టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని తెలిపారు.
దీనికి ప్రతిస్పందనగా,జిన్‌పింగ్ కార్యవర్గంలోని పలువురు మంత్రులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
బీజింగ్ వాణిజ్యశాఖ కార్యదర్శి మాట్లాడుతూ,''చైనా మత్తుపదార్థాలను నిర్మూలించేందుకు కట్టుబడి ఉంది. విధానపరంగా, అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రయత్నాల్లో అమెరికా సహా అన్ని దేశాలతో సహకారం అందిస్తోంది.
అమెరికా తన తప్పును పునరావృతం చేయకుండా ఉండాలని,సంప్రదింపుల ద్వారా అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నాం. అయితే, అమెరికా తనదైన మార్గంలో ముందుకు సాగితే,చైనా కూడా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటుంది'' అని తెలిపారు.
వివరాలు
అమెరికా ఫెంటనిల్ అంశం
''టారిఫ్ ఒత్తిడులు,బ్లాక్‌మెయిల్ కోసం అమెరికా ఫెంటనిల్ అంశాన్ని ఉపయోగిస్తోంది.
ఈ పరిణామాలు ఒత్తిడిని పెంచడమే కాకుండా,మాదకద్రవ్యాల నియంత్రణపై ఇరు దేశాల మధ్య చర్చలు,సంప్రదింపులకు ముప్పుగా మారతాయి"అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాంగ్ పేర్కొన్నారు.
అమెరికాతో వాణిజ్య విభేదాలు ఏర్పడిన ప్రతిసారి,చైనా ముందుగా ఆ దేశ వ్యవసాయరంగాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది.
2018 వరకు,అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉండేది.
ఆ సమయంలో,బీజింగ్ సోయాబీన్,బీఫ్,పోర్క్,గోధుమ,మొక్కజొన్న వంటి ఉత్పత్తులపై 25% టారిఫ్‌లు విధించింది.
దీని ప్రభావంతో,అమెరికా ఆ మార్కెట్‌పై మెల్లగా తన పట్టును కోల్పోయింది.
2024 నాటికి, చైనా అమెరికా నుంచి 29.25 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14% తక్కువ.