Page Loader
Marriage Scams: 'మ్యారేజ్‌ స్కామ్స్‌'పై చైనా హెచ్చరిక..బంగ్లా యువతులతో అక్రమ వివాహాలపై సీరియస్‌ 
'మ్యారేజ్‌ స్కామ్స్‌'పై చైనా హెచ్చరిక..బంగ్లా యువతులతో అక్రమ వివాహాలపై సీరియస్‌

Marriage Scams: 'మ్యారేజ్‌ స్కామ్స్‌'పై చైనా హెచ్చరిక..బంగ్లా యువతులతో అక్రమ వివాహాలపై సీరియస్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

వివాహ సంబంధ మోసాల విషయంలో చైనా తన పౌరులను అప్రమత్తం చేసింది. దేశంలో పెళ్లికి యువతుల కొరత పెరుగుతున్న నేపథ్యంలో, కొందరు చైనా యువకులు దానిని అధిగమించేందుకు అక్రమ మార్గాల్లో వివాహాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన చైనా, దీనిపై కీలక హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్‌లో చైనా రాయబార కార్యాలయం ప్రత్యేకంగా తన దేశపు పౌరులకు సూచనలు చేసింది. బంగ్లాదేశ్‌లో కనిపిస్తున్న అనధికారిక మ్యాట్రిమోనీలకు, మోసపూరిత క్రాస్‌ బోర్డర్ డేటింగ్ వీడియోలకూ సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా బంగ్లా యువతులతో అక్రమ వివాహాలకు పాల్పడకుండా ఉండాలని, వివాహానికి ముందుగా అన్ని అంశాలను, నిబంధనలను సవివరంగా పరిశీలించాలని తెలిపింది.

వివరాలు 

 సుమారు మూడు కోట్ల చైనా యువకులకు వివాహం కాలేదు 

చైనాలో వివాహాల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుముఖం పడుతోంది. ఇందుకు ఉద్యోగ అవకాశాల లోపం,ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే యువత ఆలోచన,దేశంలో మహిళల శాతం తక్కువవుతుండటం వంటి కారణాలు ఉన్నాయి. దీంతోసుమారు 3కోట్ల చైనా యువకులకు ఇప్పటివరకు జీవిత భాగస్వాములు దొరకలేదు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ యువతులను వివాహాల నెపంతో చైనాకు అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఇటీవల పలువురు మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. ఈవివాహాలు చట్ట విరుద్ధంగా జరుగుతున్నాయని, ఆపై అనేక న్యాయపరమైన చిక్కులకు గురయ్యే అవకాశముందని చైనా ఎంబసీ తన ఎడ్వైజరీలో స్పష్టం చేసింది. ఇలాంటి సరిహద్దు ఆవల వివాహాలు,లైంగిక సంబంధాల బాధితులు చట్టపరమైన రక్షణ కోసం వెంటనే పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీకి ఫిర్యాదు చేయాలని సూచించింది.

వివరాలు 

 11 మంది అరెస్ట్ 

చట్ట విరుద్ధంగా ఇటువంటి వివాహాలకు పాల్పడితే మానవ అక్రమ రవాణా కేసులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం,మానవ అక్రమ రవాణాలో పాల్పడి దోషిగా తేలితే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేసు తీవ్రతపై ఆధారపడి యావజ్జీవం లేదా మరణశిక్షల వరకూ విధించే అవకాశమూ ఉంది. గతంలో కొన్ని క్రిమినల్ నెట్‌వర్క్‌లు బంగ్లా యువతులను భారత్‌కు అక్రమంగా ట్రాఫిక్ చేసిన ఘటనలు వెలుగు చూసిన సందర్భాలు ఉన్నాయి. 2021లో ఢాకాలో ఇటువంటి ఆరోపణలపై 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్‌టాక్‌ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా మార్చుకుని యువతుల అక్రమ రవాణాకు ఉపయోగించినట్టు అప్పటి వార్తల్లో వెల్లడైంది.