Trump-Harris: ట్రంప్, హారిస్ ప్రచారాన్ని లక్ష్యంగా చేసుకున్న చైనా హ్యాకర్లు.. అసలు ఏమీ జరిగిందంటే?
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థుల ప్రచారంపై చైనా హ్యాకర్లు దాడి చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను చైనా హ్యాకర్లు హ్యాక్ చేస్తున్నారని శుక్రవారం మీడియా నివేదికలు తెలిపాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జే డి వాన్స్ ప్రచారాలను కూడా ఈ హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ట్రంప్, వాన్స్ ప్రచార బృందాలు ఈ ఆరోపణలను ఇప్పటికీ అంగీకరించలేదు. అయితే వారి బృందం హ్యాకింగ్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం అందింది.
స్పందించిన చైనా రాయబార కార్యాలయం
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించకుండా అడ్డుకోవడానికి కమలా హారిస్ చైనా, ఇరాన్‌లను ప్రోత్సహించాయని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపించారు. ఈ ఘటనపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. "హ్యాకింగ్‌కు సంబంధించి తమకు నిర్దిష్ట సమాచారం లేదని, చైరా అన్ని రకాల సైబర్ దాడులకు వ్యతిరేకంగా ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాకింగ్ జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ముగ్గురు సభ్యులపై అమెరికా ఆరోపణలు వేస్తోంది. వారు నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.