LOADING...
Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌..
చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌..

Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ను మనం ఇంకా పూర్తిగా మరిచిపోలేదు. ప్రపంచంలోని అనేక దేశాలు, ముఖ్యంగా అమెరికా, ఈ మహమ్మారిని చైనానే సృష్టించిందని గట్టిగా నమ్ముతున్నాయి. ఇప్పుడు మరోసారి చైనాపై అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం కరోనా వైరస్‌ కలకలం రేపితే, ఇప్పుడు ఓ కొత్త ప్రమాదం అంటే ఫంగస్‌ చైనాలో తయారై భయానక ఆయుధంగా మారుతోందని అమెరికా హెచ్చరిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రమాదకర ఫంగస్‌ను చైనాలో తయారు చేసి అమెరికాలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు చైనా శాస్త్రవేత్తలను అమెరికా అరెస్ట్ చేసింది. వారి పేర్లు జియాన్, లియు. ప్రస్తుతం ఈ ఇద్దరినీ FBI విచారిస్తోంది. ఫంగస్‌ను అక్రమంగా తరలించారని కేసు నమోదు చేసింది.

వివరాలు 

ఫంగస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా పెద్ద నష్టం

FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ వెల్లడించిన ప్రకారం,అరెస్ట్ చేసిన చైనీయుల వద్ద "ఫుసారియమ్ గ్రామినేరమ్" అనే ఒక ప్రమాదకర ఫంగస్‌ను గుర్తించారు. ఇది వ్యవసాయ ఉగ్రవాదానికి ఉపయోగపడే జీవాయుధమని అమెరికా తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ ఫంగస్ నమూనాలను ప్రస్తుతం మిషిగన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం తరలించారు. ఈ ఫంగస్‌ వల్ల కలిగే ప్రమాదం ఏమిటంటే.. ఇది ప్రధానంగా గోధుమ,బార్లీ,మొక్కజొన్న,వరి వంటి ధాన్య పంటలపై దాడి చేస్తుంది. దీని వల్ల హెడ్ బ్లైట్ అనే వ్యాధి వస్తుంది. ఇది కేవలం పంటలకే కాకుండా, మనుషులు, పశువుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. శాస్త్రవేత్తల వ్యాఖ్యానాల ప్రకారం, ఇప్పటికే ఈ ఫంగస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా పెద్ద నష్టం జరుగుతోంది.

వివరాలు 

అమెరికాలో ఉండే మిషిగన్ ల్యాబ్‌కి ఫంగస్‌

చైనా నుండి ఈ ఫంగస్‌ మిషిగన్ ల్యాబ్‌కు చేరిన ఈ సుదీర్ఘ ప్రయాణం వెనక అసలు నిగూఢ రహస్యమేంటన్నది ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇది కేవలం అధ్యయనాల కోసమా? లేక అంతకంటే ఘోరమైన కుట్రా? అమెరికా ప్రభుత్వ యంత్రాంగం వెల్లడించిన అంశాలు, అందించిన ఆధారాలు అత్యంత ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. శాస్త్రీయ ప్రయోగాల కోసమే అయితే, చైనాలోని ల్యాబ్‌లలో జరపవచ్చు కదా—అంటే, ఎందుకు అమెరికాలో ఉండే మిషిగన్ ల్యాబ్‌కి వీటిని తీసుకొచ్చారు?

వివరాలు 

అమెరికా ఆహార సరఫరా వ్యవస్థ లక్ష్యంగా భయానక కుట్ర

చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్‌ చేస్తోందా? ఈసారి అత్యంత ప్రమాదకర ఫంగస్‌ను ప్రయోగిస్తోందా? అంటే.. అవునంటోంది అమెరికా.. చైనా ఈసారి వ్యవసాయ రంగాన్ని లక్ష్యంగా చేసుకుని 'ఆగ్రో టెర్రరిజం' చేయాలని కుట్ర పన్నుతోందని.. ఈ ఆరోపణల ప్రకారం,ఇప్పటికే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులో చైనా కమ్యూనిస్టు పార్టీకి విధేయురాలైన శాస్త్రవేత్త జియాన్,మరో శాస్త్రవేత్త లియును అధికారులు పట్టుకున్నారు. జియాన్‌కి చైనా ప్రభుత్వమే నిధులు సమకూర్చిందని సమాచారం.అమెరికాలో పనిచేస్తున్న పరిశోధన సంస్థల లోపలకి చైనా తన శాస్త్రవేత్తలను పంపించి, పక్కా పథకంతో కుట్ర చేస్తున్నదని FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది కేవలం వీసా మోసం కాదు,అమెరికా ఆహార సరఫరా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్న భయానక కుట్ర అని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

చైనాపై తీవ్ర విమర్శలు చేస్తున్న అమెరికా మీడియా

వుహాన్ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ తయారైనట్లే, ఇప్పుడు మిషిగన్ ల్యాబ్‌ వంటి విదేశీ పరిశోధనా కేంద్రాల్లో మరోసారి చైనాకు చెందిన జీవాయుధ ప్రయోగాలు జరగకుండా ఉండేందుకే అమెరికా ముందస్తుగా అప్రమత్తమవుతోంది. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని విచారణ జరుపుతోంది. అమెరికా మీడియా కూడా చైనాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. దీనికి చైనా కూడా తీవ్రంగా స్పందిస్తూ, అమెరికాపై ఘాటుగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా జీవాయుధాల ప్రస్తావన పునరావృతమవుతోంది. చైనా నుంచి ఏదైనా ముప్పు వచ్చే అవకాశం ఉందని అమెరికా అనుమానిస్తోంది. అందుకే ఈ ఫంగస్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ అవుతున్నాయి.