USA: సీఐఏ సంస్థలోని ఉద్యోగుల బైఅవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తనను ఇబ్బందికి గురి చేసిన డీప్‌స్టేట్‌ను సహించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఒక్కోకటిగా నిజమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కేంద్రంగా నిలిచిన సీఐఏపై ట్రంప్ కోతల ఖడ్గం ఝుళిపించారు.
ఆ సంస్థలోని ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఈ అంశానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు సీఎన్‌ఎన్‌కు వివరాలు వెల్లడించారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా ఒక భాగంగా ఉంది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదికలో ఈ అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించారు.
వివరాలు
ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగే వారికి ఎనిమిది నెలల జీతం
ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన ప్యాకేజీ ప్రకారం, ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగే వారికి ఎనిమిది నెలల జీతం చెల్లించనున్నారు.
ఈ అవకాశాన్ని స్వీకరించేందుకు మంగళవారం వరకు గడువు ఇచ్చారు. అయితే, మొదట్లో జాతీయ భద్రతా సంస్థలను ఈ ఆఫర్‌లో చేర్చలేదు.
కానీ, కొత్త సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్ సీఐఏ ఉద్యోగులను కూడా ఈ పథకంలో భాగం చేసేందుకు ఆమోదం కోరుతున్నట్లు సమాచారం.
ఈ ఆఫర్ సీఐఏ ఉద్యోగులకు తెలియజేసారా లేదా, ఎవరికెంత వర్తిస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
గత వారం, అమెరికా 'ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్' నుంచి 'డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'లోని కొందరు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మార్గదర్శకాలు పంపినట్లు సీఎన్‌ఎన్ కథనం పేర్కొంది.
వివరాలు
20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-మెయిల్
సీఐఏలోని కొన్ని కీలక ఇంటెలిజెన్స్ అధికారులు డీప్‌స్టేట్‌లో భాగమని ట్రంప్ వర్గీయులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.
అంతేకాక, సీఐఏలో కొన్ని విభాగాలు అధికంగా ఖర్చు చేస్తున్నాయని భావన వ్యక్తమవుతోంది.
సమగ్రంగా చూస్తే,అమెరికా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించేందుకు'ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్' గత నెలలో ఒక మెమో విడుదల చేసింది.
ఈ మేరకు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారు.
ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే ఎనిమిది నెలల జీతం అందించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఫిబ్రవరి 6వ తేదీలోగా తాము ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంపై ఉద్యోగులు స్పష్టత ఇవ్వాలని సూచించారు.