Columbia University row: పాలస్తీనా అనుకూల ఆందోళనల అణచివేతపై కొలంబియా యూనివర్సిటీ అధ్యక్షురాలిపై మండిపడ్డ వర్సిటీ ప్యానెల్
కొలంబియా యూనివర్శిటీ(Columbia University)లో పాలస్తీనా(Palestine)అనుకూల ఆందోళనను అణిచివేసేందుకు యూనివర్సిటీ అధ్యక్షురాలు నేమతా మినౌకీ షఫీక్(Nemat Minouche Shafik)తీసుకున్న చర్యలపై వర్సిటీ ప్యానెల్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా(Gaza)లో హమాస్(Hamas)పై ఇజ్రాయెల్(Israel)చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా యూనివర్శిటీలో నిరసనకారులు ఏర్పాటు చేసిన గుడారాల శిబిరాన్ని కూల్చివేసేందుకు ఈ నెల 18న న్యూయార్క్ పోలీసులను షఫీక్ క్యాంపస్ కు పిలిపించారు. ఆ రోజు 100 మందికి పైగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మాన్‌హట్టన్ క్యాంపస్‌లో వేసిన గుడారాలను పోలీసులు తొలగించారు. కాని నిరసనకారులు మళ్లీ టెంట్‌లను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కాలిఫోర్నియా నుండి బోస్టన్ వరకు ఉన్న పాఠశాలల వద్ద వందలాది మంది నిరసనకారులు ఆందోళనలు నిర్వహించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తీర్మానంపై ఇంకా స్పందించని షఫీక్
ఈ ఘటనలపై యూనివర్సిటీ పర్యవేక్షణ ప్యానెల్ షఫీక్ పై అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. విద్యార్థుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును తప్పుపట్టాయి. ఐవీ లీగ్ స్కూల్ నిబంధనలకు, సంప్రదాయలకు విరుద్ధంగా నడుస్తుందని ప్యానెల్ ఆక్షేపించింది. విద్యా స్వేచ్ఛను షఫీక్ అణిచివేశారని మండిపడింది. క్యాంపస్ కు పోలీసులను పిలిపించి నిరసనలను అణచివేయడం ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల గోప్యతకు భంగం వాటిల్లిందని, యూనివర్శిటీ వారి హక్కులను విస్మరించిందనే తీర్మానాన్ని పర్యవేక్షణ ప్యానెల్ ఆమోదించింది. దీంతో షఫీక్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. షఫీక్ పేరు ఎక్కడా ఉపయోగించకుండా పర్యవేక్షణ ప్యానెల్ చేసిన తీర్మానానికి షఫీక్ నుంచి కానీ, యూనివర్సిటీ పరిపాలన కమిటీ నుంచి కానీ ఎటువంటి స్పందన రాలేదు.