Iraq: ఇరాక్ పార్లమెంట్‌లో వివాదాస్పద చట్టం.. బాల్య వివాహాలకు అవకాశం?
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాక్ పార్లమెంట్‌లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ పర్సనల్ స్టేటస్ చట్టంలో సంస్కరణలను ఆమోదించినట్లు సమాచారం.
అయితే ఈ కొత్త మార్పులు బాల్య వివాహాలకు మళ్లీ అనుమతినిచ్చేలా ఉండటంతో దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ కొత్త చట్టాలు ఇస్లామిక్ కోర్టులకు పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంపై మరింత అధికారాన్ని అప్పగిస్తున్నాయి.
1959లో ప్రవేశపెట్టిన పర్సనల్ స్టేటస్ చట్టం, కుటుంబ చట్టాలను ఏకరీకరించి మహిళల హక్కులకు రక్షణ కల్పించిన చట్టం, ఇప్పుడు ఈ కొత్త మార్పులతో నష్టపోయే అవకాశం ఉందని విమర్శకులు అంటున్నారు.
ఇప్పటి వరకు ఇరాక్ చట్టం ప్రకారం 18 ఏళ్లు పూర్తయినవారికి మాత్రమే వివాహం చేయడానికి అనుమతులుంటాయి.
Details
ఈ చట్టాలు ఇస్లామిక్ సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్నాయి
అయితే తాజా మార్పులు కొన్ని ఇస్లామిక్ పాఠశాలల నిబంధనల ప్రకారం బాలికలకు 9 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయడానికి మార్గం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
ప్రధానంగా షియా మతానికి చెందిన కఠిన మనోభావాలున్న సభ్యులు ఈ మార్పులను సమర్థిస్తూ, ఈ చట్టాలు ఇస్లామిక్ సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్నాయని, పాశ్చాత్య ప్రభావాన్ని తగ్గించడమే తమ ఉద్దేశమని తెలిపారు.
మరోవైపు ఈ సమావేశంలో జనరల్ అమ్నెస్టీ చట్టం కూడా ఆమోదించారు.
ఇది ముఖ్యంగా సున్నీ ఖైదీలకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, అవినీతి, నిధుల దుర్వినియోగంలో ముక్తి కల్పించేలా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Details
బాలికల హక్కులను హరించడమే
అంతేకాక కుర్దిష్ ప్రాంతాల భూసంబంధిత డిమాండ్లను పరిష్కరించేందుకు భూముల పునరుద్ధరణ చట్టాన్ని కూడా ఆమోదించారు.
అయితే మహిళా హక్కుల కార్యకర్తలు, ఇరాక్ ఉమెన్స్ లీగ్ సభ్యురాలు ఇంటిసార్ అల్ మయాలి ఈ చట్టాలకు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఈ చట్టం బాల్య వివాహాలకు అనుమతిని ఇస్తుందని, ఇది బాలికల హక్కులను పూర్తిగా హరించి, వారికి మరింత నష్టం చేస్తుందన్నారు.
విడాకులు, కాపురం, వారసత్వం విషయంలో మహిళలకు రక్షణ ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక పార్లమెంట్ సమావేశం తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య ముగిసింది.
హాజరైన సభ్యుల్లో సగానికి పైగా ఓటింగ్ చేయకపోవడంతో క్వారమ్ పూర్తికాలేదని, ఇది చట్టబద్ధతను ప్రశ్నార్థకంగా మార్చుతుందని పార్లమెంట్ అధికారికుడు పేర్కొన్నారు.
Details
అప్పీల్ కు దారితీసే అవకాశం
చట్టాలు ఆమోదం పొందడాన్ని తాము మద్దతు ఇస్తున్నామని, అయితే వివిధ చట్టాలను కలిపి ఓటింగ్ చేయడం సరైన ప్రక్రియ కాదన్నారు.
ఇది న్యాయస్థానంలో అప్పీల్‌కు దారితీసే అవకాశం ఉందని స్వతంత్ర ఎంపీ రయీద్ అల్ మాలికీ వ్యాఖ్యానించారు.
అయితే, పార్లమెంట్ స్పీకర్ మహ్మౌద్ అల్ మష్హదానీ ఈ చట్టాలను "న్యాయం బలోపేతానికి, పౌరుల నిత్య జీవితాల పరిపాలనకు కీలకమైన అడుగు" అని అభివర్ణించారు.
ఇది ఇరాక్‌లో రాజకీయ, సామాజిక వాతావరణాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది.