USA: భారత అక్రమ వలసదారులను కోస్టారికా దేశానికి తరలించేలా అమెరికా ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తమ దేశంలోకి స్వీకరించనున్నట్లు కోస్టారికా సోమవారం ప్రకటించింది.
ఈ విషయంపై ఆ దేశాధ్యక్ష కార్యాలయం స్పందిస్తూ, "బుధవారం 200 మంది వలసదారులతో కూడిన విమానం మా దేశానికి చేరుకుంటుంది. వీరంతా మధ్య ఆసియా, భారతదేశానికి చెందినవారే" అని వెల్లడించింది.
వీరిని కమర్షియల్ విమానం ద్వారా తరలించనున్నారు. అనంతరం పనామా సమీపంలోని వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని పంపే ప్రక్రియ చేపడతారు.
ఈ మొత్తం చర్యకు అవసరమైన ఖర్చును అమెరికానే భరించనుంది.
అంతర్జాతీయ వలస సంస్థ (International Organization for Migration) ఈ ప్రక్రియను పర్యవేక్షించనుందని కోస్టారికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది.
వివరాలు
ఒప్పందాలు కుదుర్చుకున్న గ్వాటెమాలా, పనామా దేశాలు
ఇటీవల, అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో లాటిన్ అమెరికాలో పర్యటించారు.
ఈ సందర్బంగా గ్వాటెమాలా, పనామా దేశాలు కూడా ఇలాంటి ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.
ఇప్పటికే, పనామా తొలివిడత కింద 119 మంది చైనా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందిన వలసదారులను స్వీకరించింది.
అయితే గ్వాటెమాలకు మాత్రం అమెరికా నుంచి వలసదారులు ఇప్పటివరకు రాలేదు.
వివరాలు
అమెరికా నుండి రెండు విమానాలు భారతదేశానికి
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తుండగా, 112 మంది భారతీయులను సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్‌కు తరలించారు.
గతంలో ఇప్పటికే రెండు విమానాలు భారతదేశానికి వచ్చాయి, ఇది మూడోది. తాజాగా వచ్చిన 112 మంది భారతీయులలో 44 మంది హరియాణాకు, 33 మంది గుజరాత్‌కు, 31 మంది పంజాబ్‌కు చెందినవారు.
మిగిలిన వారు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలవారు. వీరి వివరాలను అధికారులు పరిశీలించిన అనంతరం వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.
శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకున్న రెండో విమానంలో మరో 116 మంది భారతీయులు వచ్చారు.