Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ ప్రాజెక్టుకు కోర్టు బ్రేక్.. నిర్మాణ పనులపై స్టే!
ఈ వార్తాకథనం ఏంటి
వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక పబ్లిక్ గోల్ఫ్ కోర్స్‌ను ఆధునీకరించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి కొద్ది గంటల ముందే అమెరికా కోర్టు స్టే విధించింది. స్థానిక ప్రజలు, పర్యావరణ, చారిత్రక ప్రదేశాల పరిరక్షణ సంస్థలు చేపట్టిన న్యాయపోరాటంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు సుమారు రెండు మైళ్ల దూరంలో ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్ విషయంలో వివాదం కొనసాగుతోంది. దీనిని 15 నెలల పాటు మూసివేసి భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంతో గోల్ఫ్ కోర్స్ అసలు స్వరూపం మారిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
సామాన్యులకు అందుబాటులో ఉండే గోల్ఫ్ కోర్స్పై వివాదం
వాషింగ్టన్‌లోని ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్ (East Potomac Golf Links) పొటోమాక్ నది ఒడ్డున ఉంది.
ఇది చారిత్రాత్మక పబ్లిక్ గోల్ఫ్ కోర్స్ కావడంతో సామాన్య ప్రజలు కూడా ఇక్కడ గోల్ఫ్ ఆడేందుకు అవకాశం ఉంది.
అయితే ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ప్రాజెక్టుతో ఈ కోర్స్ స్వరూపం మారిపోవడమే కాకుండా, గోల్ఫ్ ఆడే ఫీజులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు వాదిస్తున్నారు.
అలా జరిగితే సామాన్యులకు ఈ సదుపాయం అందుబాటులో ఉండదని ఆందోళన చెందుతున్నారు. ఈ అభ్యంతరాలను ట్రంప్ తోసిపుచ్చారు.
వాషింగ్టన్ ప్రాంతంలో నివసించే వారికి గోల్ఫ్ ఆడే ఫీజులో 50 శాతం తగ్గింపు ఇస్తామని ప్రకటించారు.
వివరాలు
భద్రతా కారణాలతో మూసివేయాల్సి వస్తోంది
అయినప్పటికీ, డీసీ ప్రిజర్వేషన్ లీగ్ (DC Preservation League), ఇద్దరు స్థానిక గోల్ఫ్ క్రీడాకారులు ఫిబ్రవరిలోనే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం ప్రారంభించారు.
గోల్ఫ్ కోర్స్‌ను మూసివేసి నిర్మాణ పనులు చేపడితే తమకు, సామాన్య ప్రజలకు తిరిగి భర్తీ చేయలేని నష్టం జరుగుతుందని కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుపై శుక్రవారం కోర్టులో సుమారు ఐదు గంటల పాటు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ఈస్ట్ పొటోమాక్ పార్క్‌ను భద్రతా కారణాలతో మూసివేయాల్సి వస్తోందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు.
వివరాలు
ఐదు గంటల పాటు కోర్టులో విచారణ
ఈ పార్కులో మూడు గోల్ఫ్ కోర్సులు, ఒక చిన్న గోల్ఫ్ కోర్స్, సైక్లింగ్ మార్గాలు, ఇతర వినోద సదుపాయాలున్నాయి.
ప్రస్తుతం పార్కు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న నేషనల్ లింక్స్ ట్రస్ట్ (National Links Trust)తో ప్రభుత్వ ఒప్పందం ఆదివారంతో ముగుస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అయితే ఈ వాదనలపై న్యాయమూర్తి అన్నా రేయెస్ (Anna Reyes) అనుమానాలు వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా పార్కును మూసివేయడానికి భద్రతా సమస్యలను కారణంగా చూపలేదని ప్రశ్నించారు.
ఒప్పందం ముగియడం పార్కును మూసివేయడానికి అసలు కారణం కంటే, ఆ నిర్ణయానికి ఒక ఆధారం చూపించే ప్రయత్నంలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
వివరాలు
కోర్టు ఆదేశాలకు ముందే ట్రంప్ అసంతృప్తి
కోర్టు ఆదేశాలు వెలువడకముందే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గోల్ఫ్ కోర్స్ మరమ్మతులను త్వరగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలన్న ప్రయత్నాలకు న్యాయమూర్తి మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు.
వాషింగ్టన్ ప్రాంతంలో నివసించే వారికి గోల్ఫ్ ఆడే ఫీజులో 50 శాతం తగ్గింపు కల్పిస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఈప్రాంతాన్ని ప్రత్యేకమైన గోల్ఫ్ కోర్స్‌గా అభివృద్ధి చేయాలన్నది తన ప్రణాళికగా పేర్కొన్నారు.
అయితే కోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి ప్రాజెక్టు పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. వాషింగ్టన్లో ట్రంప్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న మరికొన్ని ప్రాజెక్టులు కూడా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
వీటిలో భారీ స్మారక ద్వారం నిర్మాణం, వైట్‌హౌస్‌లో ప్రతిపాదించిన భారీ బాల్రూమ్ నిర్మాణం ఉన్నాయి.
వివరాలు
ట్రంప్ ప్రభుత్వంలోని ఇతర ప్రాజెక్టులకూ న్యాయపరమైన సవాళ్లు
ఇటీవల మరో న్యాయస్థానం స్మారక ద్వారం నిర్మాణంపై 14 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది.
గోల్ఫ్ కోర్స్ కేసులోనూ నిర్మాణ పనులను నిలిపివేయాలన్న పిటిషన్‌పై కోర్టు తొలుత వెంటనే నిర్ణయం తీసుకోలేదు.
అయితే అక్టోబర్‌లో పార్కులోని చెట్లను నరికివేసిన తర్వాత న్యాయమూర్తి ప్రభుత్వ చర్యలపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు నైతిక నియమాలను ఉల్లంఘించారా? కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారా? అనే అంశాలపై కూడా విచారణ ప్రక్రియ ప్రారంభమైంది.
మరోవైపు ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి అన్నా రేయెస్ను విచారణ నుంచి తప్పించాలని అమెరికా న్యాయ శాఖ (Department of Justice) కోరింది. అయితే ఆమె మాత్రం కేసు విచారణ నుంచి తప్పుకోవడానికి నిరాకరించారు.