Hamas-Israel conflict: మా మద్దతు పాలస్తీనియన్లకే: సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్- ఇజ్రాయెల్ పరస్పర దాడులతో రెండు భూభాగాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించని సౌదీ అరేబియా ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై స్పందించింది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము శాంతిని నెలకొల్పేందుకు పాలస్తీనియన్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌కు సౌదీ యువరాజు వెల్లడించారు. పాలస్తీనా ప్రజల హక్కులు, ఆకాంక్షలను కాపాడటానికి న్యాయమైన, శాశ్వతమైన శాంతిని సాధించడానికి తమ దేశం ఆ దేశానికి మద్దతుగా నిలుస్తుందని మహ్మద్ మహ్మద్ చెప్పినట్లు సౌదీ మీడియా పేర్కొంది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు 1600మంది వరకు మరణించారు.
సౌదీ- ఇజ్రాయెల్ ఒప్పందాల చర్చల సమయంలో యువరాజు కామెంట్స్
ఇజ్రాయెల్‌ను ఎన్నడూ సౌదీ అరేబియా దేశంగా గుర్తించలేదు. అయితే ఈ మధ్యకాలంలో సౌదీకి ఇజ్రాయెల్‌ను దగ్గర చేసేందుకు అమెరికా తీవ్ర ప్రయత్నం చేస్తోంది. సౌదీ- ఇజ్రాయెల్ మధ్య ఒప్పందాలను కుదిర్చేందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. దీనికి సంబంధించి పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చల్లో పురోగతి కూడా కనిపించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇప్పుడు సౌదీ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. మక్కా, మదీనాలోని ఇస్లాం పవిత్ర స్థలాలకు నిలయంగా ఉన్న సౌదీ అరేబియాకు పాలస్తీనా చాలా కీలకమైన దేశమని ప్రిన్స్ మహ్మద్ గతంలోనే చెప్పారు. పాలస్తీనియన్ల జీవితాన్ని సులభతరం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.