
Czech court: పన్నూన్ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు కోర్టు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు ఆమోదం తెలిసింది.
అయితే ప్రభుత్వం ఒప్పుకుంటేనే అప్పగించాలనే షరతును కోర్టు విధించింది.
పన్నున్ హత్య కుట్ర కేసులో జూన్ 30, 2023న చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో నిఖిల్ గుప్తాను అరెస్టు చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా చెక్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నారు.
పన్నూన్‌కు అమెరికా,కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. దీంతో విచారణ కోసం అతడిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.
పన్నూన్
సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో గుప్తా
ఇప్పుడు నిఖిల్‌ని అమెరికాకు అప్పగించేందుకు చెక్ కోర్టు మార్గం సుగమం చేసింది. అయితే మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
నిఖిల్ గుప్తా ఆశలన్నీ ఇప్పుడు చెక్ ప్రభుత్వ న్యాయ మంత్రి పావెల్ బ్లేజెక్‌పైనే ఉన్నాయి.
గుప్తా అప్పగింతపై తుది నిర్ణయం న్యాయశాఖ మంత్రి పావెల్ బ్లేజెక్ చేతుల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ విషయంలో మంత్రి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఏమీ చెప్పలేమన్నారు.
ఈలోగా చెక్ రిపబ్లిక్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో నిఖిల్ గుప్తా ఉన్నట్లు తెలుస్తోంది.
దిగువ కోర్టు నిర్ణయాలపై తమకు అనుమానాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు మూడు నెలల సమయం ఉంటుందని అధికార ప్రతినిధి తెలిపారు.