Trump Vs Harris: 'నేను జో బైడెన్ కాదు, ఖచ్చితంగా ట్రంప్ లాగా కాదు'.. ట్రంప్, హారిస్ మధ్య మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరాటంలో కీలకమైన చర్చ ప్రారంభమైంది. నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య జరిగిన తొలి చర్చలో మాటల యుద్ధం కొనసాగింది. హారిస్ తన ప్రసంగంలో ట్రంప్‌పై విమర్శలు చేస్తూ, ఆయన ప్రజాస్వామ్యంపై దాడి చేశారని, దేశాన్ని సమస్యల్లో పడేసారని ఆరోపించారు. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైతే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించారు. ట్రంప్ తన సమాధానంగా అమెరికాను నంబర్‌వన్‌గా నిలబెట్టడం తన లక్ష్యమని, కరోనా సమయంలో సమర్థంగా పనిచేశానని చెప్పారు. అయితే, హారిస్ వద్ద దేశానికి సంబంధించిన ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలు లేవని ఆయన విమర్శించారు.
అమెరికాను చైనాకు ట్రంప్ అమ్మేశారు: హారిస్
హారిస్ మాట్లాడుతూ, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, ఆయన దేశానికి ద్రవ్యలోటు తెచ్చారని విమర్శించారు. ట్రంప్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలను తాము, ముఖ్యంగా బైడెన్, సరిచేశామని చెప్పారు. అలాగే, ట్రంప్‌కు పారదర్శకత లేకుండా పనిచేశారని, ఆయన అమెరికాను చైనాకు అమ్మేశారని ఆరోపించారు. మేం చిరు వ్యాపారాలు, కుటుంబాలకు సాయం చేస్తామన్నారు. కానీ, ట్రంప్ మాత్రం బిలియనీర్లు, కార్పొరేట్లకు పన్ను తగ్గింపులు ఇస్తారని, దీంతో అమెరికా 5 ట్రిలియన్ డాలర్ల లోటును ఎదుర్కొంటుందని ఆమె అన్నారు. అంతేకాక, ట్రంప్ మహిళల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని,ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే అబార్షన్ నిషేధంపై సంతకం చేస్తారని పేర్కొన్నారు.
కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్: ట్రంప్
గర్భవిచ్ఛిత్తిపై నిర్ణయం మహిళలకే ఉండాలని, వారు సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారని హారిస్ అన్నారు. ఆమె స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు పన్ను తగ్గింపులపై ప్రణాళికలు ఉన్నాయని కూడా చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ, కరోనా కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని, తన హయాంలో ద్రవ్యోల్బణం లేదని చెప్పారు. బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా చైనాకు పూర్తిగా దాసోహమైందని అన్నారు.అలాగే, కమలా హారిస్ ఒక పెద్ద మార్క్సిస్ట్ అని వ్యాఖ్యానించారు. బైడెన్-హారిస్ జంట దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. గర్భవిచ్ఛిత్తి పై కూడా మాట్లాడిన ట్రంప్, తాను నిషేధానికి అనుకూలం కాదని, గర్భవిచ్ఛిత్తిపై సంతకం చేయబోనని స్పష్టం చేశారు.