Baltic Sea: బాల్టిక్ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం.. రష్యాపై అనుమానాలు!
బాల్టిక్ సముద్ర గర్భంలో రెండు ముఖ్యమైన ఇంటర్నెట్ కేబుల్స్ దెబ్బతినడంతో యూరోప్ అంతటా కలకలం రేగింది. లిథువేనియా-స్వీడన్, ఫిన్లాండ్-జర్మనీ మధ్య సముద్ర గర్భంలో విస్తరించిన ఈ కేబుల్స్ దెబ్బతినడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలపై నాటో సభ్యదేశాలు, టెలికమ్యూనికేషన్ సంస్థలు ముమ్మర దర్యాప్తును ప్రారంభించాయి. లిథువేనియాలోని టెలియా లిథువేనియా సంస్థ ప్రకారం, ఆదివారం ఉదయం లిథువేనియా-స్వీడన్ మధ్య ఇంటర్నెట్ కేబుల్ తెగిపోయింది. దీంతో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ అంతరాయం సాధారణ పరికరాల లోపం వల్ల కాకుండా కేబుల్ వల్ల జరిగిందని స్పష్టం చేశారు.
ముందుగానే హెచ్చరించిన అమెరికా
ఫిన్లాండ్‌లోని సినియా సంస్థ సోమవారం ధృవీకరించిన వివరాల ప్రకారం, ఫిన్లాండ్-జర్మనీ మధ్య కనెక్టివిటీ కల్పించే సముద్ర గర్భ కేబుల్ కూడా దెబ్బతింది. ఈ కేబుల్ మధ్య ఐరోపా దేశాలతో ఫిన్లాండ్‌ను అనుసంధానించే ప్రధాన రవాణా మార్గం. నష్టం తీవ్రతపై ఇంకా అంచనా వేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇందులో రష్యా దళాల హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర గర్భ కేబుల్స్ ఉన్న ప్రాంతాల్లో రష్యా దళాలు ఇటీవల కార్యకలాపాలు నిర్వహించాయని అమెరికా ముందుగానే హెచ్చరించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ, మాస్కో తమ వ్యూహాలను మరింత ముమ్మరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అప్రమత్తమైన నాటో కూటమి
స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం పొందిన తర్వాత వారి భద్రతా ఏర్పాట్లు మరింత కీలకంగా మారాయి. ఇటీవల ఈ దేశాలు ప్రజలకు యుద్ధ భయం నేపథ్యంలో తగిన సూచనలు అందిస్తూ లక్షల కొద్దీ బుక్‌లెట్లను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో నాటో కూటమి మరింత అప్రమత్తంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.