Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2024 విజేతగా అమెరికాకు చెందిన ధ్రువి పటేల్
భారత్ వెలుపల జరిగే అతిపెద్ద అందాల పోటీలు ముగిసాయి, అందులో 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024'గా ధ్రువీ పటేల్ ఎన్నికైంది. ఈ కార్యక్రమం న్యూ జెర్సీ ఎడిసన్‌లో జరిగింది, అక్కడ ఆమెకు కిరీటాన్ని అందించారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో కంప్యూటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ విద్యనభ్యసిస్తోంది. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ టైటిల్‌ను కైవసం చేసుకోవడం తనకు ఉన్నత గౌరవంగా భావిస్తున్నట్లు ధ్రువీ తెలిపింది. ఆమె బాలీవుడ్ నటిగా, యూనిసెఫ్ అంబాసిడర్‌గా రాణించాలని ఆశపడుతున్నట్లు చెప్పారు. ఈ పోటీలో సురినామ్‌కు చెందిన లీసా అబ్డోల్‌హక్ ఫస్ట్ రన్నరప్‌గా, నెదర్లాండ్స్ నుండి మాళవిక శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
మిస్టర్స్ కేటగిరీలో విజేతగా ట్రినిడాడ్ టోబాగోకు చెందిన సువాన్ మౌట్టెట్
మిస్టర్స్ కేటగిరీలో ట్రినిడాడ్ టోబాగోకు చెందిన సువాన్ మౌట్టెట్ విజేతగా నిలవగా, యూకేకు చెందిన స్నేహ నంబీయార్ ఫస్ట్ రన్నరప్‌గా, మరో యూకే అభ్యర్థి పవన్‌దీప్ కౌర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. మిస్ టీన్ వరల్డ్‌వైడ్ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సూరెట్ టైటిల్ దక్కించుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన శ్రేయా సింగ్ తొలి రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధ టెడ్‌జోయ్ రెండో రన్నరప్‌గా నిలిచారు. న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ 31 సంవత్సరాలుగా ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఇండో అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.