LOADING...
Massive Oil Reserves: పాకిస్థాన్ దగ్గర నిజంగా భారీ చమురు నిల్వలున్నాయా? ట్రంప్ కొత్త డీల్ వెనక నిజం ఏమిటి?
ట్రంప్ కొత్త డీల్ వెనక నిజం ఏమిటి?

Massive Oil Reserves: పాకిస్థాన్ దగ్గర నిజంగా భారీ చమురు నిల్వలున్నాయా? ట్రంప్ కొత్త డీల్ వెనక నిజం ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో ఒక కొత్త ఒప్పందాన్ని ప్రకటించారు. భారతదేశంపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించిన కొన్ని గంటలకే ఈ ప్రకటన వెలువడింది. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా, పాకిస్థాన్‌లో ఉన్న భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో సహకరించనుందని ట్రంప్ తెలిపారు. అందుకోసం ఒక మంచి చమురు కంపెనీని ఎంచుకునే ప్రక్రియలో ఉన్నామన్నారు. దీని కారణంగా భవిష్యత్తులో భారత్‌కు పాక్‌ చమురు విక్రయించొచ్చు అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

2016 నాటికి పాకిస్థాన్ వద్ద ఉన్న ఆయిల్ నిల్వలు 3.53 కోట్ల బారెళ్ళు 

అయితే ట్రంప్ చెబుతున్నట్టుగా పాకిస్థాన్‌లో నిజంగా అంత పెద్ద స్థాయిలో చమురు నిల్వలున్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. వరల్డోమీటర్(Worldometer)గణాంకాల ప్రకారం 2016 నాటికి పాకిస్థాన్ వద్ద ఉన్న ఆయిల్ నిల్వలు 3.53 కోట్ల బారెళ్ళు మాత్రమే. ఇది ప్రపంచ మొత్తం నిల్వల్లో కేవలం 0.021 శాతం మాత్రమే. రోజుకు పాకిస్థాన్ వాడే చమురు సుమారు 5.56లక్షల బారెల్లు కాగా, రోజూ ఉత్పత్తి చేసే మోతాదేమో కేవలం 88,000బారెల్లు మాత్రమే. అంటే దిగుమతులు లేకుండా చూస్తే, ఇంకా రెండు సంవత్సరాల పాటు మాత్రమే ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అంతేకాదు, 2021లో అమెరికా ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం,పాకిస్థాన్ తన అవసరాలకు కేవలం 20శాతం మాత్రమే ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది.

వివరాలు 

ఖైబర్ పక్తూన్‌ఖ్వా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కీలకమైన నిల్వలు 

మిగిలిన 80 శాతం ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీని ఆధారంగా చూస్తే, పాకిస్థాన్ వద్ద తగినంత వనరులున్నాయని చెప్పడం కష్టం. ఇదే సమయంలో, పాకిస్థాన్ ప్రభుత్వ ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ (OGDCL) ఇటీవల సింధ్ రాష్ట్రంలో కొత్త చమురు, గ్యాస్ వనరులను కనుగొంది. అంతేకాదు, గత సంవత్సరం నుంచి ఖైబర్ పక్తూన్‌ఖ్వా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా మరికొన్ని కీలకమైన నిల్వలు బయటపడినట్లు సమాచారం. ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్న అన్వేషణలే కానీ, వాణిజ్యంగా ఉపయోగపడతాయో లేదో తెలియాల్సి ఉంది. ఇంకా 2024 సెప్టెంబర్‌లో,పాకిస్థాన్ తన సముద్ర జలాల్లో పెద్దఎత్తున చమురు, వాయువు నిల్వలను కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి.

వివరాలు 

పాకిస్థాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయిల్ నిల్వల దేశంగా మారే అవకాశం

మూడు సంవత్సరాల సర్వే తర్వాత ఈ వనరులు బయటపడ్డాయని చెబుతున్నారు. ఒకవేళ, ఈ వనరులు పూర్తిగా వాడగలిగితే, వెనిజుయెలా, సౌదీ అరేబియా, ఇరాన్ తర్వాత పాకిస్థాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆయిల్ నిల్వల దేశంగా మారే అవకాశం ఉంది. కానీ ఈ వనరులు నిజంగా ఎంతవరకూ వాణిజ్యపరంగా ఉపయోగపడతాయో అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎలాంటి తవ్వకాలు పూర్తిగా ప్రారంభం కాలేదు. నిల్వల పరిమాణం ఎంత? నాణ్యత ఏ స్థాయిలో ఉంది? వాడతగినంతగా ఉన్నాయా? అన్నదే అసలు ప్రశ్న. నిపుణులూ ఇదే చెబుతున్నారు. అభివృద్ధికి అవసరమైన సాంకేతికత, ప్రణాళికలు, పెట్టుబడులు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని అంటున్నారు.

వివరాలు 

వనరులను అభివృద్ధి చేయాలంటే కనీసం $5 బిలియన్ డాలర్ల ఖర్చు

అంచనాల ప్రకారం ఈ వనరులను అభివృద్ధి చేయాలంటే కనీసం $5 బిలియన్ డాలర్లు ఖర్చు కావాలి. అంటే దాదాపు ₹40,000 కోట్లు. అదీ కాకుండా,తవ్వకాలు ప్రారంభించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కనీసం ఐదు సంవత్సరాలు పడొచ్చు. అంతటితో కథ కంచికి వెళ్ళలేదు.. తరువాత రిఫైనరీలు,పైప్‌లైన్లు,పంపిణీ వ్యవస్థలు వంటివి నిర్మించేందుకు మరింత పెట్టుబడులు అవసరం. ఇక పాకిస్థాన్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూస్తే, ఇది చాలా కష్టమైన పని. దేశానికి ఇప్పటికే $126 బిలియన్ రుణ భారం ఉంది.

వివరాలు 

ఇంధన దిగుమతులకు ఏటా $17.5 బిలియన్ డాలర్ల ఖర్చు

పైగా, ఇంధన దిగుమతులకు ఏటా $17.5 బిలియన్ డాలర్ల ఖర్చు వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో, భారీ చమురు ప్రాజెక్ట్‌ను ముందుకు నడపడం ఆ దేశానికి చాలా కష్టమే. అందుకే, ట్రంప్ చెప్పిన "పాకిస్థాన్ వద్ద Massive Oil Reserves" ఉన్నాయన్న మాట ఆశాజనకంగా అనిపించినా.. వాస్తవానికి ఇప్పటివరకు దానికి సరైన ఆధారాలు లేవు. కొన్ని వనరులు కనుగొన్నా, అవి వాణిజ్యంగా ఎంతమేర పనిచేస్తాయో అన్నది ఇంకా తెలియదు.