20 నిమిషాలు జైల్లో గడిపిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 2లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలయ్యారు. ఈ మేరకు 2,00,000 డాలర్ల బాండ్‌ను సమర్పించారు. జార్జియాలో 2020 ఏడాదిలో జరిగిన ఎన్నికలను తారుమారు చేసేందుకు యత్నించిన ఆరోపణలపై ట్రంప్ గురువారం న్యాయస్థానంలో లొంగిపోయారు. జార్జియా ఎన్నికలకు సంబంధించి అమెరికా మాజీ ప్రథమ పౌరుడ్ని అరెస్ట్ చేశారు.ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఫుల్టన్ కౌంటీ జైలులో ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ దాదాపుగా 20 నిమిషాల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే న్యూజెర్సీకి వచ్చే విమానం కోసం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇప్పటికే ఈ ఏడాదిలో నాలుగుసార్లు లొంగిపోయిన ట్రంప్
గురువారం కోర్టు ప్రాంగణంలో నేవీ సూట్,ఎరుపు రంగు టై ధరించిన ట్రంప్, కోపంగా కనిపించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చారు. న్యాయాన్ని అబాసుపాలు చేశారని ఆరోపించారు. ఒక్క 2023 ఏడాదిలోనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ముందు ట్రంప్ నాలుగోసారి లొంగిపోవడం గమనార్హం. గురువారం అట్లాంటాలోని హార్ట్‌ఫీల్డ్ - జాక్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఆయన వచ్చే ముందు ఫుల్టన్ కౌంటీ జైలు బయట భారీగా భద్రతను మోహరించారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి, ఇద్దరు ప్రతివాదుల బాండ్ ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 2 లక్షల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తు(బాండ్)పై ట్రంప్ విడుదలయ్యారు.