Page Loader
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత 
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..కొత్త పెన్నీల ముద్రణ నిలిపివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కరెన్సీలో అత్యల్పమైన విలువ కలిగిన పెన్నీల (సెంట్స్‌)తయారీని పూర్తిగా నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో పెన్నీ నాణెం తయారీకి రెండు పెన్నీలు ఖర్చు అవుతున్నాయని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా వృథా ఖర్చుగా అభివర్ణించారు.ఈ విషయాన్ని ట్రూత్‌ సోషల్‌లో ఒక పోస్టు ద్వారా వెల్లడించారు. ''ఎన్నో సంవత్సరాలుగా అమెరికా పెన్నీలను ముద్రిస్తోంది. అయితే, ఒక్కో పెన్నీ తయారీకి రెండు సెంట్లు ఖర్చు అవుతోంది. ఇది పూర్తిగా అనవసరమైన వ్యయం. అందుకే, పెన్నీల ముద్రణను ఆపివేయాలని ట్రెజరీ సెక్రటరీకి నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. మన గొప్ప దేశ బడ్జెట్‌లో వృథా ఖర్చును పూర్తిగా తొలగించాలి. అది పెన్నీ అయినా సరే'' అని ట్రంప్‌ తన పోస్టులో వెల్లడించారు.

వివరాలు 

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు  ట్రంప్‌ 

న్యూఆర్లిన్స్‌లో జరిగిన సూపర్‌ బౌల్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను ట్రంప్‌ ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడిన ఆయన, ఎలాన్ మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ (DOGE) ఇప్పటికే ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని ముఖ్యమైన లోపాలను గుర్తించిందని పేర్కొన్నారు. ఈ లోపాలను ముందుగా గమనించి ఉండి ఉంటే, దేశ ఆర్థిక భారం మరింత తక్కువగా ఉండేదని అన్నారు. ఇటీవల డోజ్‌ సంస్థ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లోని సమాచారం చూసేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే.

వివరాలు 

ట్రంప్‌ 2.0: ఖర్చులకు కళ్లెం వేయడంపై దృష్టి

ట్రంప్‌ పాలనలో ప్రభుత్వ ఖర్చులను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఏజెన్సీల్లో జరుగుతున్న వ్యయ వ్యర్థతపై దృష్టి పెట్టారు. అలాగే, పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. శ్వేతసౌధంలో "ఫెయిత్‌ హౌస్" ఏర్పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో మరో కీలక మార్పు చేయనున్నారు. ప్రతీ శుక్రవారం "ఫెయిత్‌ హౌస్‌" ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని నిర్వహణ బాధ్యతలను టెలి ఎవాంజలిస్ట్‌ పౌలా వైట్‌కు అప్పగించారు. ఆమెను ట్రంప్‌ తన ఆధ్యాత్మిక సలహాదారుగా భావిస్తారు.

వివరాలు 

పామ్ బోండి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు

అంతేకాక, అటార్నీ జనరల్‌ పామ్ బోండి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అమెరికాలోని క్రిస్టియన్‌ ప్రజలపై ఏ విధమైన వేధింపులు జరగకుండా ఈ టాస్క్‌ ఫోర్స్‌ పనిచేస్తుందని తెలిపారు. ఇవాంజెలికల్‌ క్రిస్టియన్లు 2024 ఎన్నికల్లో ట్రంప్‌కు బలమైన మద్దతుదార్లుగా నిలిచారని విశ్లేషకులు చెబుతున్నారు. 2016లో "బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌" ఆందోళనల సందర్భంగా పోలీసులు తొలగించిన తర్వాత, ట్రంప్‌ తన చేతిలో బైబిల్‌ పట్టుకుని శ్వేతసౌధం సమీపంలోని చర్చి వద్ద నిలబడిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. తాజాగా, ఎన్నికల ప్రచారం సమయంలో జరిగిన కాల్పుల ఘటనలో తృటిలో తప్పించుకున్న అనంతరం, తాను మరింత దైవభక్తుడిగా మారిపోయానని ట్రంప్‌ వెల్లడించారు.