Donald Trump On Green Card: స్వరం మార్చిన డొనాల్డ్ ట్రంప్.. ఈజీగా గ్రీన్ కార్డు మంజూరు చేస్తానని హామీ
అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డ్ ఇవ్వడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించారు. అమెరికా కాలేజీల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, టెక్నాలజీ పెట్టుబడిదారులతో 'ఆల్-ఇన్' అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ట్రంప్, వలసదారులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో అమెరికాలో వలసదారులపై చేసిన వ్యాఖ్యలకు ఇవి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కొవిడ్ మహమ్మారి కారణం
"అమెరికా కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారికి తప్పనిసరిగా గ్రీన్ కార్డు ఇవ్వాలి. గ్రీన్ కార్డు ఇస్తే వారు కచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వాలి. వలసదారుల విషయంలో నేను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడానికి కొవిడ్ మహమ్మారి కారణం. అగ్రశ్రేణి కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యూఎస్‌లో ఉండాలనుకునే విదేశీయుల గురించి నాకు తెలుసు. అయితే వారు వీసాలు పొందలేక స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుంది." అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గతంలో వలసదారులపై తీవ్ర విమర్శలు
దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు నేరాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు, ప్రభుత్వ వనరులను స్వాధీనం చేసుకుంటున్నారని గతంలో ట్రంప్ ఆరోపించారు. వలసదారులు మన దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని అన్నారు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని పేర్కొన్నారు. తన పరిపాలన సమయంలో, ట్రంప్ కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రామ్‌లపై వంటి చట్టపరమైన వలసలపై నియంత్రణలకు కూడా ప్రతిపాదించారు.
లోపభూయిష్టంగా H1-B ప్రోగ్రామ్
2017లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' అనే నినాదాన్ని ఇచ్చారు. యుఎస్ లో కార్మికులను రక్షించడానికి అధిక వేతనం,స్కిల్ కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే బిజినెస్ వీసాలు మంజూరు చేసేలా సంస్కరణలను సూచించాలని క్యాబినెట్ సభ్యులను ఆదేశించారు. కంపెనీలు సాధారణంగా విదేశీ ఉద్యోగులను టెంపరరీగా నియమించుకోవడానికి ఉపయోగించే H1-B ప్రోగ్రామ్ లోపభూయిష్టంగా ఉందని, టెక్ కంపెనీలు తక్కువ శాలరీతో విదేశీ ఉద్యోగులను తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారని ఆయన అంతకముందు చెప్పారు.