Donald Trump: రష్యా చమురు సరఫరాకు అనుమతి.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
చమురు కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్యూబాకు అమెరికా కొంత ఊరటనిచ్చింది. ఆ దేశానికి వెళ్లే రష్యా చమురు నౌకకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకు క్యూబాకు చమురు సరఫరాపై డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలు ఉండగా, ఇప్పుడు వాటిని కొంత సడలించడం గమనార్హం. సుమారు 7.3 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో బయల్దేరిన రష్యా నౌక 'అనాటోలీ కొలోడ్కిన్' మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి ప్రయాణం ప్రారంభించింది. ఇంగ్లిష్ ఛానల్ దాటి అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశించింది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా ఈ నౌక క్యూబాకు చేరుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి.
వివరాలు
త్వరలోనే క్యూబా ప్రభుత్వం కూలిపోతుంది
ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ, ''ప్రస్తుతం క్యూబాకు చమురు సరఫరా చేయాలనుకునే ఏ దేశమైనా నాకు అభ్యంతరం లేదు. అది రష్యా అయినా సరే, ఇంకెవరైనా సరే సమస్య లేదు. త్వరలోనే క్యూబా ప్రభుత్వం కూలిపోతుంది'' అని వ్యాఖ్యానించారు. అనంతరం రష్యా చమురు నౌకకు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా మరో ప్రకటన విడుదల చేసింది. ఈ నౌక మంగళవారం క్యూబాకు చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై చర్యల అనంతరం క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయింది. క్యూబాకు చమురు అందించే దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
వివరాలు
క్యూబాలో చమురు సంక్షోభం తీవ్రరూపం
అంతేకాకుండా క్యూబాను స్వాధీనం చేసుకుంటానన్న ఆయన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాలకు దారి తీశాయి. ఈ పరిణామాల కారణంగా క్యూబాలో చమురు సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రజారవాణా వ్యవస్థ దెబ్బతిని, కొన్ని విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు నౌక రాక క్యూబాకు కొంత ఉపశమనాన్ని కలిగించనుంది.