
Donald Trump: మరో సంచలనానికి సిద్ధమైన ట్రంప్.. అర్ధరాత్రి 2 గంటలకు కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అనూహ్య ప్రకటనలతో అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచదేశాలను ఉలిక్కిపడేలా చేయనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4.30 గంటలకు, అంటే భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి 2 గంటలకు ట్రంప్ ఓవల్ ఆఫీసులో ఓ ముఖ్య ప్రకటన చేయనున్నారని వైట్‌హౌస్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఆయన ఏం ప్రకటించబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రకటన భారత్‌పై సుంకాల అంశానికి సంబంధించినదే అయి ఉండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివరాలు
భారత్ లక్ష్యమా..?
ఇప్పటికే మరో 24 గంటల్లో భారత్‌పై భారీ సుంకాల ప్రకటన చేస్తానని ట్రంప్ హెచ్చరించగా, ఇది ఆ ప్రకటనతో ముడిపడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌ను విశ్వసనీయమైన వ్యాపార భాగస్వామిగా పరిగణించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ ఓపెన్గా వ్యాఖ్యానించారు. అలాగే న్యూఢిల్లీ రష్యా నుండి ముడి చమురు కొనుగోలు చేస్తోందని, దీని ద్వారా మాస్కో తన యుద్ధయంత్రానికి ఇంధనం అందించగలుగుతోందని తీవ్రంగా విమర్శించారు. దీనిపై తాను అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతూ, దానికి ప్రత్యుత్తరంగా భారత్‌పై భారీగా సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్ భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు.
వివరాలు
రష్యాపై ఆంక్షలు అమలవుతాయా..?
ఇక రష్యా అంశంపై కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కోఫ్ ప్రస్తుతం మాస్కోలో పర్యటనలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన సమావేశమయ్యే అవకాశముందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భేటీ తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేస్తారన్న సంకేతాలను ఇప్పటికే ఇస్తూ వచ్చారు. రష్యా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే, ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న చర్చలు నడుస్తున్నాయి.
వివరాలు
బ్యాంకులపై విమర్శలు, ఇతర కీలక నిర్ణయాల సంకేతాలు
ఇక అమెరికాలోని బ్యాంకులపై కూడా ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి రాజకీయ ప్రేరణతో నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఫెడ్ చైర్మన్ పదవికి నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని కూడా వెల్లడించారు. త్వరలోనే ఈ పదవికి సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే విధంగా, సెమీకండక్టర్ల రంగంలోనూ, ఔషధ పరిశ్రమ (ఫార్మా)పై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్టు ఇటీవల వ్యాఖ్యానించారు. వాటిపై కూడా ఈ మీడియా సమావేశంలో ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ట్రంప్ సమవేసానికి ప్రపంచమంతటా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.