
Xi Jinping: డ్రాగన్-ఏనుగు స్నేహం ప్రపంచ శాంతికి దోహదం: జిన్‌పింగ్
ఈ వార్తాకథనం ఏంటి
షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. ఇరువురి నేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భారత్-చైనా స్నేహపూర్వకంగా కలిసి ఉండటం సరైన ఎంపిక అని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీని మరోసారి కలవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. ఎస్‌సీవో సదస్సులో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం పలికారు. గతేడాది కజాన్‌లో జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు దేశాలుగా భారత్, చైనా 'గ్లోబల్ సౌత్'లో కీలక పాత్ర పోషిస్తున్నాయని జిన్‌పింగ్ అన్నారు.
Details
ద్వైపాక్షిక సంబంధాలు దీర్ఘకాలం కొనసాగాలి
రెండు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం సంబంధాలను పునరుద్ధరించాల్సిన బాధ్యత తమ భుజాలపై ఉందని పేర్కొన్నారు. పొరుగు దేశాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. డ్రాగన్ (చైనా)-ఏనుగు (భారత్) కలసి ముందుకు సాగడం ఇరు దేశాల విజయాలకు దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా, దీర్ఘకాలం కొనసాగేలా చూడాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్-చైనా కలిసి ముందుకు సాగాలని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
Details
త్వరలో విమాన సర్వీసులు పునఃప్రారంభం
ఇక ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం నెలకొన్నదని అన్నారు. కైలాశ్ మానససరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలో భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభం కానున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్-చైనా సహకారం 2.8 బిలియన్ల మంది ప్రజలకు మేలు చేస్తుందని మోదీ పేర్కొన్నారు.