Elon Musk: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేస్తారు: మస్క్ సంచలన కామెంట్స్
Elon Musk: టెస్లా యజమాని ఎలాన్ మస్క్ అమెరికా చట్టసభ సభ్యులతో ట్విట్టర్ వేదికగా జరిగిన చర్చలో ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గరని, ఒకవేళ తగ్గితే.. ఆయన హత్యకు గురయ్యే అవకాశం ఉందని మస్క్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఓడిపోతుందని అనుకోవడం చాలా పెద్ద తప్పు అన్నారు. అది జరిగే అవకాశమే లేదన్నారు. అమెరికా చట్టసభ సభ్యులు ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయంపై చర్చిస్తున్న సమయంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్‌కు చేసే సాయం యుద్ధాన్ని పొడిగిస్తుంది: మస్క్
ట్విట్టర్ వేదికగా జరిగిన చర్చలో చట్టసభ సభ్యులు విస్కాన్సిన్‌కు చెందిన రాన్ జాన్సన్, ఒహియోకు చెందిన జేడీ వాన్స్, ఉటాకు చెందిన మైక్ లీ, వివేక్ రామస్వామి, క్రాఫ్ట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు డేవిడ్ సాచ్‌లు ఉన్నారు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం చేయకూడదని కొందరు ఎంపీలు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ ఓడిపోరన్నారని అమెరికా చట్ట సభ్యుడు రాన్ జాన్సన్ అన్నారు. ఒకవేళ.. ఉక్రెయిన్ విజయాన్ని ఆశిస్తే.. వారు కల్పిత ప్రపంచంలో జీవిస్తున్నారని అర్థం చేసుకోవచ్చన్నారు. రాన్ జాన్సన్ మాటలతో ఎలాన్ మస్క్ ఏకీభవించారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు అందించే ఆర్థికసాయం యుద్ధాన్ని పొడిగిస్తుందన్నారు. కానీ ఉక్రెయిన్‌కు ఎలాంటి సాయం చేయదన్నారు.