Hydrogen fuel : పర్యావరణహిత విమానాలు.. హైడ్రోజన్ ఇంధనపై ప్రయోగాలు!
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత విమానాల కల సాకారమవుతోంది. కేవలం భూభాగంలోనే కాకుండా నింగిలో ప్రయాణించే విమానాల్లో కూడా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించడానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్విట్జర్లాండ్‌లోని 'ఈటీహెచ్ జ్యూరిక్ పరిశోధన కేంద్రం' హైడ్రోజన్ ఇంజిన్ల అభివృద్ధికి పునాది వేస్తోంది. శాస్త్రవేత్తలు ఇంధన ప్రజ్వలనను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఇంజిన్లను దీర్ఘకాలిక మన్నికతో తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. హైడ్రోజన్‌తో నడిచే మధ్యశ్రేణి విమానాల అభివృద్ధికి ఐరోపా సమాఖ్య (ఈయూ) గతేడాది ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో భాగంగా, హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే జెట్ ఇంజిన్ల రూపకల్పనను పరిశోధన సంస్థలు చేపట్టాయి. హైడ్రోజన్ కిరోసిన్ కంటే వేగంగా మండుతుంది. దీనివల్ల చిన్న స్థాయి జ్వాలలు ఉత్పన్నమవుతాయి.
వైమానిక రంగంలో కొత్త శకం
అయితే ఇంజిన్‌లో ప్రభావం చూపే ప్రకంపనల రూపంలో ఓ సవాల్ ఉంది. ఇవి చాంబర్‌పై మిగిలే ఒత్తిడిని పెంచి, ఇంజిన్‌కు హాని కలిగించే అవకాశం ఉంది. ప్రకంపనలను నియంత్రించేందుకు ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. హైడ్రోజన్ ఇంజిన్‌లోని దహనచాంబర్ల రూపకల్పన, ఇంధన ఇంజెక్షన్ నాజిల్స్ డిజైన్ ద్వారా ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈటీహెచ్ జ్యూరిక్, 'జీఈ ఏరోస్పేస్' భాగస్వామ్యంతో హైడ్రోజన్ ఇంజెక్షన్ నాజిల్స్‌ను తయారు చేసింది. విమానం క్రూజింగ్ సమయంలో తలెత్తే పరిస్థితులను అనుకరించే పరీక్షల కేంద్రం ద్వారా, ఈ నాజిల్స్ సామర్థ్యాన్ని ధృవీకరిస్తున్నారు. హైడ్రోజన్ ఇంజిన్ల రూపకల్పన త్వరలోనే మరింత అభివృద్ధి చెందుతుందని, పర్యావరణహిత విమానయానానికి ఇది కొత్త శకం తెరుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.