ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు
సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినప్పటికీ, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు అంధకారంగానే ఉందని పాకిస్థాన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) మంగళవారం ఇమ్రాన్ ఖాన్‌ను నాటకీయంగా అరెస్టు చేసింది. 48 గంటల తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో ఇమ్రాన్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని, అరెస్టు 'చట్టవిరుద్ధం' అని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఇమ్రాన్‌కు అనుకూల నిర్ణయం తీసుకున్నా, అతని రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయని, ముఖ్యంగా అతని పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి రోజులు దగ్గర పడ్డాయని విశ్లేషకులు, ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సైన్యానికి వ్యతిరేకంగా వెళ్లడం వల్లే ఇమ్రాన్‌కు కష్టాలు
పాకిస్థాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వెళ్లడమే ఇమ్రాన్‌కు కష్టాలను తెచ్చిపెట్టిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అతను నేడు ఈ స్థితికి రావడానికి కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలే అని అభిప్రాయపడుతున్నాయి. ఇమ్రాన్‌కు ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంది. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇన్నాళ్లు పీటీఐ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను ఇమ్రాన్ ఎదగనివ్వలేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే ఆయన రాజకీయ భవిష్యత్ కు బలహీనతగా మారింది. ఇమ్రాన్‌పై ఉన్న కేసుల్లో ఆయన ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ ఆయన జైలుకు వెళితే పార్టీని ఎవరు నడుపుతారు అనేది ఇక్కడ ప్రధాన సమస్య.
పీటీఐని చిన్న రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నం
పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)లో ఇమ్రాన్‌కు నమ్మకమైన అనుచరులు ఉన్నారు కానీ, బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. ఇప్పుడు ఇదే పాకిస్థాన్ ఆర్మీకి, సంకీర్ణ ప్రభుత్వానికి, ఇమ్రాన్ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. ముఖ్యంగా ఇమ్రాన్ రాజకీయ ఉనికిని ప్రశ్నార్థం చేసే పనిలో ఈ మూడు వర్గాలు నిమగ్నయ్యాయి. ఇమ్రాన్ ఖాన్‌ను రాజకీయ రేసు నుంచి తప్పించి, పీటీఐని చిన్న రాజకీయ శక్తిగా మార్చడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పీటీఐలో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని సైన్యం, సంకీర్ణ ప్రభుత్వం ప్రోత్సహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తద్వారా పార్టీలో ఇమ్రాన్ ప్రాబల్యాన్ని తగ్గించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు.
పీటీఐ చీఫ్‌గా ఇమ్రాన్‌ను తొలగించే ఆలోచన
పీటీఐ చీఫ్‌గా ఇమ్రాన్‌పై అనర్హత వేటు వేసే విషయంలో కూడా ప్రత్యర్థులు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్‌ను పార్టీ చీఫ్‌గా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉన్న తోషాఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఉగ్రవాద కేసులు, హింసకు ప్రేరేపించడం వంటి కేసులు కూడా ఇమ్రాన్‌పై ఉన్నాయి. తాజాగా కోర్ కమాండర్ నివాసంపై దాడి, లూటీ కేసులు కూడా ఇమ్రాన్‌పై నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్‌ను న్యాయపరంగా చిక్కుల్లో పెట్టి, పార్టీ చీఫ్‌గా తప్పించాలని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలా చేయడం ద్వారా ఇమ్రాన్ రాజకీయ భవిష్యత్తును చేయడమే తుది లక్ష్యంగా ప్రత్యర్థులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.