
Trump: ట్రంప్ హత్య కు బెదిరింపులు.. ఎఫ్‌బిఐ మాజీ డైరెక్టర్‌పై చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తామని సోషల్ మీడియాలో బహిరంగంగా బెదిరించినట్లు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన సమాచారం అధికార వర్గాలు వెల్లడించాయి. జేమ్స్ కామీ ఇన్‌స్టాగ్రామ్‌లో '86 47' అనే పదాలను పోస్టు చేసి వెంటనే తొలగించారని, ఇందులోని కోడ్ పదజాలం "47వ అధ్యక్షుడిని హత్య చేయడం" అనే అర్థాన్ని సూచిస్తుందన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం అమెరికా సీక్రెట్ సర్వీస్ సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తోందని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ తెలిపారు.
వివరాలు
ఆ నంబర్లను హత్యలు చేయడానికి ఉపయోగిస్తారని నాకు తెలీదు: జేమ్స్ కామీ
ఈ ఆరోపణలపై స్పందించిన జేమ్స్ కామీ, తాను సముద్రతీరంలో నడుస్తూ కనపడిన షెల్‌ల ఫొటోను మాత్రమే పోస్టు చేసినట్టు వివరణ ఇచ్చారు. తన పోస్టులో ఉన్న నంబర్లకు హత్యలతో సంబంధముందని తెలియదని, అధికారులు తాను ఉద్దేశించిన అర్థాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు. అధ్యక్షుడిని హత్య చేయాలన్న ఎలాంటి ఉద్దేశం తనకు లేదని, హింసత్మక చర్యలతో తానికే ఎలాంటి ముడిపాటు లేదని చెప్పారు. తనపై అనవసర ఆరోపణలు వస్తుండటంతో ఆ పోస్టును తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంఘటన అమెరికాలో కలకలం రేపిన విషయం తెలిసిందే.
వివరాలు
తుపాకీతో దుండగుడు కాల్పులు
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో, సమీప భవనంపైకి ఎక్కిన ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమవగా, వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయన్ను రక్షించారు. ఆ ఘటన తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా, ఓ అనుమానితుడు తుపాకీతో ఫెన్సింగ్ వద్దకు రావడం గమనించిన భద్రతా బలగాలు అతడిని కాల్చి అదుపులోకి తీసుకున్నాయి.
వివరాలు
ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం
అయితే ఈ ఘటన అనంతరం మరోసారి, ట్రంప్ హాజరైన సమావేశానికి సమీపంగా ఉన్న నేషనల్ కన్వెన్షన్ ప్రాంతంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి వీపున వేసుకున్న బ్యాగ్‌లో AK-47 తుపాకీతో పాటు తూటాల మ్యాగజైన్‌ను పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఫాక్స్ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టంగా అమలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన చుట్టూ జరిగే ప్రతీ కార్యకలాపాన్ని వివిధ సీక్రెట్ సర్వీస్ సంస్థలు నిరంతరం నిఘా వేస్తున్నాయని తెలిపారు.